Rekha Jhunjhunwala : ఈవిడ నాలుగు గంటల్లో రూ.482 కోట్లు సంపాదించారు.. బెట్టింగుల్లో కాదు బిజినెస్‌లో.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-02-22T12:01:25+05:30 IST

బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా మరణానంతరం కూడా ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు.

Rekha Jhunjhunwala : ఈవిడ నాలుగు గంటల్లో రూ.482 కోట్లు సంపాదించారు.. బెట్టింగుల్లో కాదు బిజినెస్‌లో.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..

Rekha Jhunjhunwala : బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా మరణానంతరం కూడా ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే. స్టాక్ మార్కెట్ రంగంలోకి దిగిన వారంతా తప్పక ఆయన పోర్ట్‌ఫోలియోతో పాటు ఆయన తీసుకునే ప్రతి స్టెప్‌ను క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఇప్పుడు ఆయనకేమీ తీసిపోకుండా ఆయన భార్య కూడా స్టాక్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. నిన్నటికి నిన్న కేవలం నాలుగు గంటల్లో రూ.482 కోట్లు సంపాదించి రికార్డ్ క్రియేట్ చేశారు.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ప్రీ ఐపీఓ స్థాయి నుంచి స్టార్ హెల్త్‌లో ఇన్వెస్టర్‌గా ఉన్నారు. ఆయన మరణానంతరం రేఖా ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోకి ఆ స్టాక్ మారింది. 2023లో ప్రారంభమైన తర్వాత కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేరు ధర అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఈ స్టాక్ నిన్న మాత్రం రాకెట్‌లా దూసుకెళ్లింది. 52 వారాల కనిష్ట స్థాయి రూ.469 నుంచి పరుగులు తీసింది. ఒక్కసారిగా ఇంట్రా డే హై రూ.556.95కి ఎగిసింది. సోమవారం సెషన్‌లో ట్రేడ్ అయిన నాలుగు గంటల్లోపే ఇంట్రా డేలో ఈక్విటీ షేర్‌కి రూ.47.90 లాగింగ్ పెరిగింది. అంతే స్టార్ హెల్త్ షేర్ ధరలో ఈ అనూహ్యమైన మార్పుతో రేఖా ఝున్‌ఝున్‌వాలా రూ.482 కోట్లు ఆర్జించారు.

స్టార్ హెల్త్‌లో రేఖా ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు

స్టార్ హెల్త్ స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన తర్వాత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో మొత్తంగా 10,07,53,935 షేర్‌లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మొత్తం చెల్లింపు మూలధనంలో 17.50 శాతం. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నేడు లేరు కాబట్టి.. ఆ షేర్లన్నీ ఇప్పుడు రేఖ ఝున్‌ఝున్‌వాలా సొంతమయ్యాయి. ఇటీవల ఆమె కేవలం 2 వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించారు. టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ షేర్లపై బెట్టింగ్ పెట్టి కేవలం 15 రోజుల్లోనే ఇంత భారీ మొత్తం ఆర్జించారు.

Updated Date - 2023-02-22T12:01:27+05:30 IST