Rekha Rakesh Jhunjhunwala: మార్మోగిపోతున్న రేఖా రాకేశ్ పేరు.. ఇంతకీ ఎవరీమె!

ABN , First Publish Date - 2023-03-23T17:31:59+05:30 IST

దివంగత మార్కెట్ మొఘల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala) భార్య రేఖా రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా

Rekha Rakesh Jhunjhunwala: మార్మోగిపోతున్న రేఖా రాకేశ్ పేరు.. ఇంతకీ ఎవరీమె!

ముంబై: దివంగత మార్కెట్ మొఘల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala) భార్య రేఖా రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా (Rekha Rakesh Jhunjhunwala) పేరు ఇప్పుడు భారత మార్కెట్‌లో మార్మోగిపోతోంది. ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ ‌లిస్ట్-2023’లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి చోటు దక్కింది. ఈ లిస్ట్‌లో 99 నగరాల్లోని 18 ఇండస్ట్రీలకు చెందిన 176 కొత్త ముఖాలకు చోటు దక్కింది. వీరిలో ఇండియా నుంచి 16 మంది కొత్త బిలియనీర్లు ఉన్నారు. వారిలో రేఖా రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆమె కుటుంబానికి టాప్ ప్లేస్ దక్కింది. వారి కంపెనీ ‘రేర్ ఎంటర్‌ప్రైజెస్’కు ఈ జాబితాలో చోటు లభించింది.

‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన ఆమె భర్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గతేడాది ఆగస్టులో మరణించారు. భర్త నుంచి రేఖ భారీ సంపదను వారసత్వంగా పొందారు. రాకేశ్ మరణం తర్వాత రేఖ తన పోర్టుఫోలియోను మార్చారు. సందర్భానుసారంగా స్టాక్స్ కొనడం, అమ్మడం చేస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన చౌక ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌(Akasa Airline)లోనూ వీరి పెట్టుబడులు ఉన్నాయి. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖ ప్రస్తుతం నెలకు దాదాపు రూ. 650 కోట్లు సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం రేఖ చూసుకుంటున్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పోర్టుఫోలియోలో ఉన్న 29 స్టాక్స్ నికర విలువ మార్చి 22 నాటికి రూ. 32,059.54 కోట్లు. రాకేశ్ పోర్టుఫోలియోలో టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ అత్యంత విలువైన స్టాక్. ఆ తర్వాత స్టార్‌ హెల్త్, మెట్రో బ్రాండ్స్, టాటా మోటార్స్, క్రిసిల్ వంటివి ఉన్నాయి. గతేడాది డిసెంబరు నాటికి రాకేశ్ పోర్టుఫోలియో దాదాపు రూ. 33,230.35 కోట్లుగా ఉంది. ‘ట్రెండ్‌లైన్’ డేటా ప్రకారం రేఖ సొంత పోర్టుఫోలియా నికర విలువ రూ. 25,655 కోట్లు. రేఖ నికర సంపద విలువ 5.9 బిలియన్ డాలర్లు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం.. రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్, రేర్ ఈక్విటీ, జలరామ్ బాబా చిల్డ్రన్స్ నెస్ట్ ఎడ్యుకేషన్, మినోషా డిజిటల్ సొల్యూషన్స్ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.

ముంబైలో పుట్టి..

రేఖా ఝున్‌ఝున్‌వాలా 12 సెప్టెంబరు 1963లో ముంబైలో జన్మించారు. 1987లో బిగ్‌బుల్ రాకేశ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె నిష్ఠ, ఐవీఎఫ్ ద్వారా జన్మించగా, ఆ తర్వాత ఇద్దరు కవల కుమారులు ఆర్యమన్, ఆర్యవీర్ జన్మించారు. రాకేశ్ ఏర్పాటు చేసిన రేర్ ఎంటర్‌ప్రైజెస్‌(RaRe Enterprises) సంస్థ కి రాకేశ్.. తన పేరు, తన భార్య పేరు కలిసి వచ్చేలా మొదటి అక్షరాలను కలిపి ‘రేర్’(RARE) అని పేరు పెట్టారు. హురున్ రిచ్‌లిస్ట్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి చోటు దక్కడంతో రేఖ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

రాకేశ్‌కు ‘పద్మశ్రీ’

దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ అయిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను మరణానంతర పద్మశ్రీని కేంద్రం ప్రకటించింది. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాకేశ్ భార్య రేఖ ఈ పురస్కరాన్ని అందుకున్నారు.

Updated Date - 2023-03-23T17:31:59+05:30 IST