Share News

IT Guidelines: ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి?

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:21 AM

ఇంట్లో నగదు పరిమితులు, లావాదేవీలపై ఆదాయపు పన్ను నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

IT Guidelines: ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి?

ఢిల్లీ: జార్ఖండ్‌కి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహు(Dheeraj Prasad Sahoo) నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో(Incometax Raids) ఇటీవల రూ. 351 కోట్ల నగదు లభ్యమైంది. దీనిపై స్పందించిన ధీరజ్.. తమ కుటుంబం చేస్తున్న మద్యం వ్యాపారం నుంచి డబ్బులు సంపాదించినట్లు చెప్పారు. అయితే ఇంట్లో నగదు పరిమితులు, లావాదేవీలపై ఆదాయపు పన్ను నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

అధికారులకు ఆ అధికారం..

ఆదాయపు పన్ను(Incometax) శాఖ చట్టం నిబంధనల ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసిన డబ్బుపై నిర్దిష్ట పరిమితి లేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల సమయంలో డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో చెప్పడం.. దానికి సంబంధించిన వివరాలు చూపించడం సదరు వ్యక్తి బాధ్యత. ఈ సందర్భంగా లెక్కలోకి రాని నిధులు జరిమానాలకు దారితీయవచ్చు. లెక్కల్లో చూపని డబ్బును స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఐటీ శాఖ కలిగి ఉంటుంది. పట్టుబడ్డ డబ్బు ఆధారంగా 137% వరకు జరిమానాలు విధించవచ్చు.


నగదు నియమాలు

రుణాలు లేదా డిపాజిట్ల కోసం నగదు రూపంలో రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ అంగీకారం లేదు. వీటి కోసం ఎవరైనా రూ. 20 వేలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించకుండా ఆదాయపు పన్ను శాఖ కచ్చితమైన నిషేధం విధిస్తుంది. రూ. 50 వేలు కంటే ఎక్కువ లావాదేవీలకు పాన్ నంబర్లు(PAN Number) తప్పనిసరి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్(CBDT) ప్రకారం, వ్యక్తులు ఒకేసారి రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్లు లేదా ఉపసంహరణల కోసం తప్పనిసరిగా పాన్ నంబర్‌ ఇవ్వాలి. రూ. 30 లక్షలకు మించిన నగదు ఆధారిత ఆస్తుల కొనుగోలు చేసినవారు దర్యాప్తు ఏజెన్సీల పరిశీలనలోకి రావచ్చు.

క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు చేసినవారిపై నిఘా తప్పకపోవచ్చు. ఏడాదిలో బ్యాంకు నుండి రూ. కోటి కంటే ఎక్కువ నగదును విత్‌డ్రా చేసే వ్యక్తులు 2 శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో 20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు చేస్తే జరిమానాలు విధించవచ్చు. పాన్, ఆధార్ వివరాలు లేని కొనుగోళ్లకు 2 లక్షల కంటే ఎక్కువ నగదు చెల్లించకూడదు. క్రెడిట్-డెబిట్ కార్డ్‌లతో రూ.లక్ష కంటే ఎక్కువ లావాదేవీలపై పరిమితులు ఉన్నాయి. ఒక రోజులో బంధువు నుండి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు పొందడం లేదా వేరొకరి నుండి నగదు రూపంలో రూ. 20,000 కంటే ఎక్కువ రుణం తీసుకోవడం నిషేధం. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ ఆదాయపు పన్ను శాఖ నియమనిబంధనలు తెలుసుకోవాల్సిందే.

"మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Dec 17 , 2023 | 11:24 AM