Adani Group: అదానీపై సంచలన ఆరోపణలు.. దశాబ్దాలుగా చేస్తున్న పనిది..!

ABN , First Publish Date - 2023-01-25T21:34:31+05:30 IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Adani Group) యాజమాన్యంలోని అదానీ గ్రూప్‌పై (Adani Group) మరోసారి సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

Adani Group: అదానీపై సంచలన ఆరోపణలు.. దశాబ్దాలుగా చేస్తున్న పనిది..!

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Adani Group) యాజమాన్యంలోని అదానీ గ్రూప్‌పై (Adani Group) మరోసారి సంచలన ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ కంపెనీ నిస్సుగ్గుగా స్టాకుల తారుమారు (Stock manipulation), అకౌంటింగ్ మోసాలకు (Accounting fraud) పాల్పడుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ రీసెస్చ్ సంస్థ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ (Hindenburg Research) పేర్కొంది. సుమారు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూపు (Adani Group) దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుచుకుంటున్నట్టు తమ రెండేళ్ల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిందని రిపోర్ట్ తెలిపింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం... ‘ అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద ప్రస్తుతం దాదాపు 120 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్ల వ్యవధిలోనే వృద్ధి చెందింది. గ్రూపునకు చెందిన 7 కీలకమైన కంపెనీల స్టాకుల విలువ భారీగా ఎగబాకడమే ఇందుకు కారణమైంది. మూడేళ్లకాలంలో సగటున 819 శాతం మేర షేర్ల విలువ పెరిగింది. పన్ను స్వర్గధామ దేశాలైన కరేబియన్, మారిషస్ నుంచి యూఏఈ వరకు పలు దేశాల్లో అదానీ కుటుంబం నియంత్రణలో ఉన్న పలు డమ్మీ కంపెనీలను గుర్తించాం. గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి డబ్బు మళ్లించే సమయంలో అవినీతి, మనీల్యాండరింగ్, ట్యాక్స్‌పేయర్ థెఫ్ట్ (taxpayer theft) కోసం ఈ కంపెనీలను వాడుకుంటున్నారు. అదానీ గ్రూపునకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సహా డజన్ల మందితో దీనిపై మాట్లాడాం. వేలాది డాక్యుమెంట్లను పరిశీలించాం. దాదాపు అరడజను దేశాల్లో నిశితంగా పర్యవేక్షణ చేశాం. డమ్మీ కంపెనీల్లో కొన్నింటి నిజస్వరూపం బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ మా రిపోర్టుపై నమ్మకం లేకపోతే అదానీ గ్రూపు ఫైనాన్సియల్ డేటాను పరిశీలించవచ్చు’ అని హిండెన్‌బర్గ్ పేర్కొంది. కాగా అదానీ గ్రూపు ప్రధాన కంపెనీ ‘అదానీ ఎంటర్‌ప్రైజెస్’ (Adani Enterprises) సుమారు రూ.20 వేల కోట్ల విలువైన ఫాలో-ఆన్ షేర్ సేల్ (Follow-on share sale) ప్రారంభమవ్వడానికి 2 రోజుల ముందే ఈ రిపోర్ట్‌ వెలువడింది. ఎఫ్‌ఫీవో (follow-on public offer) జనవరి 27న మొదలై జనవరి 31న ముగియనుంది.

నిరాధారం, ద్వేషపూరితం: అదానీ గ్రూప్ ప్రకటన

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టివేసింది. నిరాధారమైన తప్పుడు సమాచారం, అవాస్తవాలతో కంపెనీని అపఖ్యాతి పాలుచేసే ఆరోపణలతో రిపోర్ట్ విడుదల చేయడం షాక్‌కు గురిచేసిందని కంపెనీ పేర్కొంది. కనీసం సంప్రదింపు, ధృవీకరణ లేకుండానే రిపోర్టును ప్రచురించారు. ఈ ఆరోపణలను గతంలోనే పరిశీలించారని, భారత అత్యున్నత న్యాయస్థానాలు వీటిని కొట్టివేశాయని అదానీ గ్రూప్ తెలిపింది. రిపోర్ట్ ప్రచురించిన సమయాన్ని బట్టి ఇది కుట్రపూరితమని స్పష్టమవుతోందని పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దేశంలోనే అతిపెద్ద ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ప్రధాన ఉద్దేశ్యమనేది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఎన్నిచేసిన అదానీ గ్రూపుపై ఇన్వెస్టర్లకు నమ్మకముంది. స్వార్థప్రయోజనాల కోసమేనని పేర్కొంటూ అదానీ గ్రూప్(Adani Group) సీఎఫ్‌వో (CFO) జుగేశిందర్ సింగ్ ట్వీట్ చేశారు.

2 రోజుల్లో రూ.97 వేల కోట్లు హాంఫట్!

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై నేపథ్యంలో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి. షేర్ల విక్రయానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ విల్మర్ షేర్లు 1-4 శాత మధ్య నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. దీంతో అదానీ గ్రూపునకు చెందిన 7 కంపెనీ మార్కెట్ వ్యాల్యూయేషన్ ఒక్క బుధవారమే రూ.46,086 కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మంగళ, బుధవారాల్లో కలిపి రూ.96,682 కోట్ల మేర పడిపోయింది. దీంతో జనవరి 24న రూ.19.20 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీల క్యాపిటలైజేషన్ బుధవారం రూ.18.23 లక్షల కోట్లకు పడిపోయింది.

Updated Date - 2023-01-25T21:42:55+05:30 IST