Unacademy: అన్‌అకాడమీ మళ్లీ షాకింగ్ నిర్ణయం..

ABN , First Publish Date - 2023-03-30T16:42:37+05:30 IST

లాభాల కోసం మార్గాలను అన్వేషిస్తున్న ఎడ్యూటెక్ కంపెనీ, ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి చేదువార్త చెప్పింది...

Unacademy: అన్‌అకాడమీ మళ్లీ షాకింగ్ నిర్ణయం..

బెంగళూరు: లాభాల కోసం మార్గాలను అన్వేషిస్తున్న ఎడ్యూటెక్ కంపెనీ, ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్ అన్‌అకాడమీ (Unacademy) మరోసారి చేదువార్త చెప్పింది. మరో దఫా ఉద్యోగుల కోతను ప్రకటించింది. కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 12 శాతం లేదా 380 మందిని తాజా రౌండ్‌లో తొలగించింది. మరోసారి ఇలాంటి సందేశం ఉద్యోగులకు పంపించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అన్‌అకాడమీ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ ముంజల్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు రాసిన ఇంటర్నల్ మెమోలో వివరాలను వెల్లడించారు.

కంపెనీ ప్రధాన వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించేందుకు సరైన నిర్ణయాలన్నీ తీసుకున్నామని, అందుకోసం దురదృష్టవశాత్తూ మరో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గౌరవ్ ముంజల్ అన్నారు. వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా సిబ్బందిలో 12 శాతం మేర తగ్గించాలని భావించామన్నారు. కాకపోతే మళ్లీ ఇలాంటి నిర్ణయం ప్రకటించాల్సి వస్తుందనుకోలేదన్నారు. క్షమాపణ కోరుతున్నానని ఉద్యోగులకు సందేశమిచ్చారు. రెండేళ్లక్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడులేవని అన్నారు. కరోనా టైమ్‌లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ ఉండేదన్నారు. ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులను ఎదుర్కొంటుందని, నిధుల సేకరణ ఇబ్బందికరంగా ఉందని వెల్లడించారు. అందుకే పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. యూజర్లు, షేర్‌హోల్డర్లకు వ్యాల్యూను క్రియేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఇంటర్నల్ మెమోలో గౌరవ్ ముంజల్ తెలిపారు. దీంతో 12 నెలల్లో మొత్తం 1400 మందిని తొలగించినట్టయ్యింది.

12 నెలల్లో నాలుగోసారి..

అన్అకాడమీ కంపెనీ 12 నెలల వ్యవధిలో ఉద్యోగులను తొలగించడం ఇది నాలుగోసారి. ఏప్రిల్ 2022లో 600 మంది ఉద్యోగులను, నవంబర్ 2022లో 350 మందితోపాటు ప్రధాన బిజినెస్, యూనిట్‌లలో మరికొంతమందికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. కాగా ఉద్యోగుల తొలగింపుపై సంప్రదించగా కంపెనీ స్పందించలేదని సమాచారం. అన్‌అకాడమీ కంటే ముందు బైజుస్ (Byjus), వేదాంతు కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-30T16:47:35+05:30 IST