YCP Minister: ఆ సంస్థ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరింది.. సంక్షోభంలోనూ దోచుకున్నారు..

ABN , First Publish Date - 2023-03-24T18:40:04+05:30 IST

ఏపీ సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amarnath) స్పందించారు.

YCP Minister: ఆ సంస్థ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరింది.. సంక్షోభంలోనూ దోచుకున్నారు..

అమరావతి: ఏపీ సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఐటీ సోదాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ (Gudivada Amarnath) స్పందించారు. సంక్షోభంలోనూ చంద్రబాబు (Chandrababu) దోచుకునే అవకాశాలను వెతుక్కున్నారని మంత్రి ఆరోపించారు. 2019లో జరిగిన సోదాల్లో ఐటీశాఖ భారీగా నగదు సీజ్ చేసిందని, ఏపీ సెక్రటేరియట్ నిర్మాణంలో కొన్ని కంపెనీల నుంచి భారీగా నగదు చేతులు మారినట్లు ఓ పత్రిక కథనం ప్రచురించిందని గుడివాడ అమర్నాథ్‌ గుర్తు చేశారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌ దగ్గర రూ.2 వేల కోట్లు సీజ్ చేశారని, షాపూర్ జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరిందని మంత్రి ఆరోపించారు. తాత్కాలికంగా నిర్మించిన సెక్రటేరియట్ ఓ స్కామ్ అని, నిన్నటి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లోనూ మేనేజ్ చేశారని గుడివాడ అమర్నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ముఖ ద్వారం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తు నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గతంలో విశాఖ వస్తే ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేశారు. సిగ్గు లేకుండా మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వచ్చారో తెలియడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు అనే కంటే తెలుగుదేశం బాధలే బాధలు అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తను తన కొడుకు కోసమే తాపత్రయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్ని కష్టాలలో ఉన్నా ప్రజల‌ సంక్షేమమే ముఖ్యమని భావించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు భరోసా కల్పించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంతపెంచారో ప్రజలు ఇప్పటికీ మరిచి పోలేదని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని.. అది కలగానె మిగిలిపోద్దని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

Updated Date - 2023-03-24T18:50:21+05:30 IST