వలంటియర్స్‌!

ABN, First Publish Date - 2023-02-06T00:51:22+05:30 IST

సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటోంది. నెలవారీ పెన్షన్‌లు వారే ఇవ్వాలి, రేషన్‌ను పర్యవేక్షించాలి. కొత్త పథకం అమలు చేయాలంటే సర్వే చేయాలి. జిల్లాలో అనేక మందికి గడచిన ఐదు నెలల నుంచి వేతనాలు పడడం లేదు.

సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు కావాల్సిందే..

అయినా వేతనాలు రావడం లేదంటూ వలంటీర్ల ఆవేదన..

జిల్లాలో 140 మంది ఇబ్బందులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వలంటీర్లను ప్రభుత్వం వాడుకుంటోంది. నెలవారీ పెన్షన్‌లు వారే ఇవ్వాలి, రేషన్‌ను పర్యవేక్షించాలి. కొత్త పథకం అమలు చేయాలంటే సర్వే చేయాలి. సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించాలన్నా.. పరిశీలించి అర్హతను నిర్ధారించాలన్నా వారిదే బాధ్యత. నిత్యం సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. సేవలందిస్తున్నందుకు ప్రభుత్వం వారికి ప్రతి నెలా రూ. 5వేలు గౌరవ వేతనం ఇస్తోంది. జిల్లాలో అనేక మందికి గడచిన ఐదు నెలల నుంచి వేతనాలు పడడం లేదు.

కొత్తగా నియమితులైన వలంటీర్ల విషయంలో ఇటువంటి ఇబ్బంది ఎదురవుతోంది. పాతవారే పేరే సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదై ఉంది. దానిని తొలగిస్తేనే కొత్తవారికి వేతనం మంజూరవుతోంది. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో ఒకవైపు.. ప్రభుత్వ స్థాయిలో మరోవైపు తప్పిదాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలో పదుల సంఖ్యలో వలంటీర్లకు వేతనాల రాక అవస్థలు పడుతున్నారు. గతంలో 500 మంది వరకు వేతనాలు లేకుండా సేవలందించారు. దానిని జిల్లా స్థాయిలో సరిదిద్దుకుంటూ వచ్చారు. దాంతో వేతనాలు మంజూరయ్యాయి. ఇంకా 140 మంది వరకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించారు. జిల్లాలో 9,362 క్లస్టర్‌లు ఉన్నా యి. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో ఒక వలంటీర్‌ సేవలందిస్తున్నారు. చెత్త పన్ను వసూలు చేసే బాధ్యత వారిపైనే పెట్టారు. ఇన్ని సేవలందిస్తున్నా వేతనం ఇవ్వడం లేదంటూ వలంటీర్లు వాపోతున్నారు.

తప్పెవరిది..

గ్రామ సచివాలయాల్లో డ్రాయింగ్‌ ఆఫీసర్‌గా ఎంపీడీవోలు, మునిసిపాలిటీల్లో కమిషనర్‌లు వలంటీర్లను నియమిస్తారు. వారి పేర్లను సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేస్తారు. వలంటీర్‌ భర్తీ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, మొబైల్‌ నెంబర్‌, బ్యాంక్‌ ఖాతా నెంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో పాత వలంటీర్‌ను తొలగించి కొత్త వారి పేరును నమోదు చేస్తారు. ఆ తర్వాతే వేతనం మంజూరవుతుంది. వివిధ కారణాలతో వలంటీర్‌లు వైదొలుగుతున్నారు. వ్యక్తిగత కారణాలు, ఒత్తిళ్లు, చాలీచాలని వేతనం తదితర కారణాలతో విధుల నుంచి తప్పుకుంటున్నారు. వారిస్థానంలో కొత్తవారిని భర్తీ చేస్తున్నారు. తొలిరోజుల్లో జిల్లా స్థాయిలోనే సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయలేదు. గడచిన ఐదు నెలల నుంచి అటువంటి ఇబ్బందులను సరిదిద్దుకుంటూ వచ్చారు. కొత్తగా నియమితులైన వలంటీర్లకు వేతనాలు మజూరయ్యేలా సంబంధిత అధికారులు ప్రయత్నాలు ఫలిం చాయి. ఇంకా 140 మంది పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. ఎంపీడీవోలు, కమిషనర్లు నమోదు చేసినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో పాత వారి పేర్లు తొలగించక పోవడం వల్ల కొందరికి వేతనం రావడం లేదు. దీనిపై చర్యలు తీసుకోకపోవడం వల్లే జీతాలు లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి ఉంటే విధుల నుంచి తప్పుకునేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

––––––––––––––––

Updated at - 2023-02-06T00:53:15+05:30