Durantho Express: రైల్వే గేటు పడినప్పటికీ దూసుకొచ్చిన టాటాఏస్.. ఇంతలోనే..

ABN , First Publish Date - 2023-03-30T10:00:30+05:30 IST

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భీమడోలు వద్ద పెను ప్రమాదం తప్పింది.

Durantho Express: రైల్వే గేటు పడినప్పటికీ దూసుకొచ్చిన టాటాఏస్.. ఇంతలోనే..

ఏలూరు: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భీమడోలు వద్ద పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి 2:30 గంటల ప్రాంతంలో టాటా ఏస్ వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దురంతో ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా భీమడోలు జంక్షన్ వద్ద సిబ్బంది గేటు వేశారు. అదే సమయంలో టాటాఏస్‌లో వచ్చిన కొందరు వాహనంతో గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. రైలు సమీపంలోకి రావడంతో వాహనాన్ని పట్టాలపై వదిలేసి పారిపోయారు. వాహనాన్ని ఢీకొనడంతో రైలు ఇంజన్ దెబ్బతిన్నది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌ను మార్చారు. అనంతరం రైలు విశాఖపట్నం బయలుదేరి వెళ్లింది.

అయితే ప్రమాదం జరిగిన తర్వాత దురంతో ఎక్స్‌ప్రెస్ దాదాపు ఆరుగంటల పాటు నిలిచిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన తర్వాత కేవలం మూడు చోట్ల మాత్రమే ఈ రైలు నిలుస్తుంది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఈ మూడు రైల్వేస్టేషన్లలోనే రైలు ఆగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే రాజమండ్రి వెళ్లాల్సిన కొందరు ప్రయాణికులు వేరే వేరే వాహనాల్లో తరలివెళ్లారు. విశాఖ వెళ్లాల్సిన ప్రయాణికులు మాత్రం స్టేషన్‌లోనే పడిగాపులుకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రమాదంపై భిన్న వాదనలు వినిస్తున్నాయి. గత రాత్రి టాటాఏస్‌ను హైవే పోలీసులు వెంబడించడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గేదెలు దొంగలించే ముఠా ఈ వాహనంలో ప్రయాణిస్తున్నారన్న అనుమానంతో హైవే పోలీసులు వెంబడించినట్లు సమాచారం. ఆ భయంతోనే రైల్వే గేటును ఢీకొట్టి పారిపోయేందుకు టాటాఏస్‌లో ఉన్న వారు యత్నించారు. అయితే వాహనం ఇంజన్ నిలిచిపోవడంతో పట్టాలపైనే వాహనం నిలిచిపోయింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం చిత్తుచిత్తుగా మారిపోయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-03-30T10:00:30+05:30 IST