Share News

CM Office : రుషికొండ వైపు రావొద్దు!

ABN , First Publish Date - 2023-10-29T07:13:35+05:30 IST

విశాఖలో సముద్ర తీరాన రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది...

CM Office : రుషికొండ వైపు రావొద్దు!

  • జాలర్ల బోట్లపై నిఘాకు ట్రాకింగ్‌ సిస్టమ్‌

  • నేవీ అపెక్స్‌ కమిటీ సమావేశంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రస్తావన

  • సీఎం ఆఫీసు ఏర్పాటు నేపథ్యంలో భద్రతా కోణంలో నిర్ణయం

  • బోట్లు అటు రాకుండా అడ్డుకోవచ్చని యోచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) : విశాఖలో సముద్ర తీరాన రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రుషికొండ వైపు ఏదైనా బోటు వస్తే ట్రాకింగ్‌ ద్వారా దానిని గుర్తించి అడ్డుకోవచ్చునని అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. బోట్లకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన నేవీ అపెక్స్‌ కమిటీలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని దీని అమలుపై చర్చించారు. వాస్తవానికి ఇది కొత్త నిర్ణయం కాదు. ముంబైలో ఉగ్రవాదుల దాడి తరువాత సముద్రం వైపు నుంచి వచ్చి ఎటువంటి దాడులు చేయకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

2017లోనే పైలట్‌ ప్రాజెక్టుగా...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2017లోనే పైలట్‌ ప్రాజెక్టు చేపట్టి విశాఖపట్నం, కాకినాడలో అమలుకు శ్రీకారం చుట్టింది. మెకనైజ్డ్‌ బోట్లకు జీపీఎస్‌ పరికరాలు ఇచ్చారు. వాటిని ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. జీపీఎస్‌ అమర్చిన బోట్లు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు ఎక్కడ తిరుగుతున్నాయో అధికారులు సమాచారం తెలుసుకోవచ్చు. తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు మాత్రమే వేటాడుకునే వెసులుబాటు ఉంది. ఆ హద్దు దాటితే అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించినట్టు. కోస్టుగార్డు, నేవీ దళాలు చూస్తే పట్టుకొని శిక్షించే అవకాశం ఉంది. అందుకని ఆ పరికరాలకు 12 నాటికల్‌ మైళ్ల దూరం దాటితే అలారం మోగే ఏర్పాటు కూడా చేశారు. అయితే వీటిని పర్యవేక్షించాల్సిన రాష్ట్ర మత్స్య శాఖ జిల్లా కార్యాలయాలకు తగిన వసతులు కల్పించలేదు. సాంకేతిక ఏర్పాట్లు చేయలేదు. దాంతో ఏ బోటు ఎక్కడ తిరుగుతున్నదీ తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అలా అది మూలకు చేరింది.

CS-Jawahar.jpg

సీఎం సముద్ర తీరాన ఉంటారని..

నేవీ అపెక్స్‌ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని బోట్లకు జీపీఎస్‌ పెట్టాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా బోట్లు ప్రభుత్వం ఆదేశించకపోయినా, రాయితీ ఇవ్వకపోయినా జీపీఎస్‌ ఏర్పాటు చేసుకున్నాయి. సముద్రంలో ఏ దిక్కున ప్రయాణిస్తున్నారో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. అధికార యంత్రాంగానికి వాటితో లింకు లేదు. అటువంటి ఏర్పాట్లు లేవు. భద్రతా వ్యవహారాల పరంగా నేవీకి అన్నిరకాల ఏర్పాట్లు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో సముద్రంలో బోట్లు అన్నింటికీ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇది మత్స్యకారుల ప్రయోజనం కోసమా? సీఎం భద్రత కోసమా? అని మత్స్యకార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. భద్రత పేరుతో తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని, సముద్రంలో ఎక్కడైనా వేటాడుకునే హక్కు తమకు ఉందని, దానికి అడ్డంకులు సృష్టించవద్దని మత్స్యకారులు కోరుతున్నారు. తాము భద్రతా వ్యవహారాల్లో నేవీ, కోస్టుగార్డు, మెరైన్‌ పోలీసులకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటామని, కొత్తగా ఆంక్షలు విధించవద్దంటున్నారు.

Updated Date - 2023-10-29T07:14:39+05:30 IST