AP News: సొంతూరుకు దూరంగా.. గోదావరి చెంతన బతుకు పోరాటం.. మత్స్యకారుల దీనగాధ

ABN , First Publish Date - 2023-03-11T15:28:29+05:30 IST

గోదారమ్మను నమ్ముకునే ఆ కుటుంబాలు ఏళ్లకేళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి...

AP News: సొంతూరుకు దూరంగా.. గోదావరి చెంతన బతుకు పోరాటం.. మత్స్యకారుల దీనగాధ

అల్లూరి జిల్లా: ఇసుక తిన్నెలే ఆవాసం.. ఏటి నీరే ఆధారం.. చేపల వేట కోసం సొంత ఊళ్లను వదిలి గోదారి తీరంలోనే జీవనం.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు చిత్రం... కులవృత్తి అయిన చేపల వేట కోసం నాగరిక ప్రపంచానికి దూరంగా గోదావరి నదీతీరంలో ఇసుక తిన్నెలపై పూరిపాకలు వేసుకుని బ్రతుకు వెళ్లదీస్తుంటారు మత్యకారులు.

పాపికొండల ఎగువన శబరి గోదావరి నదులలో చేపల వేట వీరి కులవృత్తి. గూటి పడవల్లోనే నివసిస్తూ నదీ తీరం వెంట సాగిపోయే సంచార జీవులు వీరు. కూనవరం, విఆర్ పురం, చింతూరు మండలాల వెంట శబరి గోదావరి నదులలో చేపల వేట సాగిస్తూ‌‌.. వచ్చిన ఆదాయంతో కడుపు నింపుకుంటారు. ఇసుక తిన్నెలపైనే జీవితం కొనసాగించే మత్య్సకార కుటుంబంలో మగవారు రాత్రులు నదిలో వలలు వేసి వేకువనే చేపల వేట సాగిస్తారు. దొరికిన చేపలను మహిళలు సమీప గ్రామాలకు తీసుకువెళ్ళి విక్రయిస్తారు. కుటుంబంలోని పిల్లలు కూడా తమ వంతుగా పెద్దవారికి సాయపడుతుంటారు. వర్షాకాలంలో తూర్పు గోదావరి జిల్లాలోని తమ గ్రామాలకు వెళ్లినా దాదాపు ఎనిమిది నెలలూ చేపల వేట కోసం తిరిగి ఇక్కడికి వచ్చి ఉంటామనీ.. అయితే పడవలలోనూ.. గోదావరి తీరం వెంట ఉండడంతో పరిసర గ్రామాలలో తమను స్థానికులుగా గుర్తించరని అన్నారు.

ABN.jpg

స్వంత ఊరికి వెళ్లినా తమను వలస ప్రజలుగానే అక్కడవారు పరిగణిస్తారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గోదారమ్మను నమ్ముకునే తమ‌ కుటుంబాలు ఏళ్లకేళ్లుగా మనుగడ సాగిస్తున్నాయని.. పూర్వం అయితే తాము తప్పటడుగులు వేసే వయసు నుంచి నీళ్ల మీదే పెరిగి పెద్దయ్యేవారమని తెలిపారు. తమ పెద్దవారికి చేదోడుగా చేపలవేటనే జీవితంగా ఉండిపోయామన్నారు. అయితే తమ పిల్లలను మాత్రం చదువు కోసం సమీప గ్రామాలలోని పాఠశాలకు పంపిస్తున్నామని చెప్పారు. అయితే స్వంత ఊరికి దూరంగా గోదావరి తీరమే జీవితంగా ఇక కొనసాగించలేమని మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-11T15:41:34+05:30 IST