tuni train incident: సంచలన కేసులో విజయవాడ రైల్వే కోర్ట్ తీర్పు.. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2023-05-01T15:55:51+05:30 IST

2016 నాటి ‘తుని రైలు దగ్ధం కేసు’ను (tuni train incident) విజయవాడ రైల్వే కోర్ట్ కొట్టివేసింది.

tuni train incident: సంచలన కేసులో విజయవాడ రైల్వే కోర్ట్ తీర్పు.. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేత

విజయవాడ: 2016 నాటి ‘తుని రైలు దగ్ధం కేసు’ను (tuni train incident) విజయవాడ రైల్వే కోర్ట్ కొట్టివేసింది. ముగ్గురు ఆర్‌పీఎఫ్ పోలీసులు విచారణ సరిగా చేయలేదని కోర్ట్ తప్పుబట్టింది. బాధ్యులైన ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేసింది. ఆధారాలు లేని కారణంగా మొత్తం 41 మందిపై కేసులను కొట్టివేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్లపాటు ఎందుకు సాగదీశారని పోలీసులను కోర్ట్ ప్రశ్నించింది. పోలీసు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోర్ట్ కోరింది.

దగ్ధమైన రైలులో అంతమంది ప్రయాణిస్తే కేవలం ఒక్కరిని మాత్రమే ప్రశ్నించడం ఏమిటని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షిగా ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా తాను ఆ రైలులో ప్రయాణించలేదని చెప్పాడని కోర్ట్ మండిపడింది. కాగా 2016 జనవరి 30న ‘కాపు నాడు సభ’ సమయంలో ఈ రైలు దగ్ధం ఘటన జరిగింది. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్‌తో టీడీపీ హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ‘కాపు నాడు సభ’ జరిగింది. అయితే తునిలో తలపెట్టిన కాపు గర్జన కార్యక్రమం హింసాయుతంగా మారింది. గుర్తుతెలియని ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రైలు కాలిపోయింది. ఈ ఘటనపై అప్పట్లో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-01T16:09:05+05:30 IST