YuvaGalamPadayatra: లోకేశ్‌ పాదయాత్రకు అనూహ్య స్పందన

ABN , First Publish Date - 2023-02-02T20:35:23+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా జీవో 1 పేరిట అడ్డుకున్న ఘటన మరువకముందే..

YuvaGalamPadayatra: లోకేశ్‌ పాదయాత్రకు అనూహ్య స్పందన

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu) తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా జీవో 1 పేరిట అడ్డుకున్న ఘటన మరువకముందే, అదే జీవోను చూపుతూ పోలీసులు గురువారం పలమనేరులో లోకేశ్‌ (Lokesh) ప్రచార రథాన్ని సీజ్‌ చేశారు. 15 నిమిషాల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా, లోకేశ్‌ సంయమనం పాటించి పరిస్థితులు చేయి దాటకుండా కార్యకర్తల్ని నిలువరించారు. తన వాహనాన్ని వదిలే వరకు అడుగు ముందుకు వేయనని భీష్మించారు. ఉన్నచోటే నిలబడిపోవడంతో, సమస్యను జటిలం చేయకుండా పోలీసులు వాహనాన్ని వదిలేశారు. చిత్తూరు జిల్లా (Chittoor District)లో లోకేశ్‌ పాదయాత్ర (LokeshPadayatra) ఏడో రోజైన గురువారం పలమనేరులో సాగింది. స్థానిక ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్దఎత్తున బహిరంగ సభ జరిగింది. తొలి నుంచీ హాజరైన ప్రజల సంఖ్యను బట్టి స్టూళ్లు, కుర్చీల మీద ఎక్కి ప్రసగించిన లోకేశ్‌, పలమనేరులో భారీ సందోహం కారణంగా ప్రచార రథం మీద ఎక్కి ప్రసగించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించగా, నాలుగు అడుగులు వేయగానే పోలీసులు ప్రచార రథాన్ని సీజ్‌ చేశారు. సమాచారం అందుకున్న లోకేశ్‌ వెంటనే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అక్కడే ఆగిపోయారు. ఈ విషయంపై పోలీసులు వచ్చి మాట్లాడాలని కోరారు. దీంతో చిత్తూరు దిశ డీఎస్పీ బాబు రాజేంద్రప్రసాద్‌ అక్కడికి చేరుకుని లోకేశ్‌తో మంతనాలు జరిపారు. తన వాహనాన్ని విడుదల చేసే వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయనని లోకేశ్‌ స్పష్టంచేశారు. చర్చలు జరుపుతున్న పోలీసు అధికారులు, సుమారు 15 నిమిషాల తర్వాత ప్రచార రథాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వాహనం విడుదలయ్యేవరకు సుమారు 15 నిమిషాలపాటు లోకేశ్‌ రోడ్డు మీదే నిలబడిపోయారు. కానీ, పలమనేరులో బహిరంగ సభకు అనుమతి లేదన్నా, ప్రచార రథాన్ని ఉపయోగించారని, 24 గంటల్లో సమాధానం ఇవ్వాలంటూ మాజీ మంత్రి అమరనాథరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

జగన్‌కు అవగాహన లేదు.. మీకైనా ఉండాలి కదా?

ప్రచార రథాన్ని సీజ్‌ చేసిన సందర్భంగా చిత్తూరు దిశ డీఎస్పీ బాబు రాజేంద్రప్రసాద్‌, నారా లోకేశ్‌ మధ్యలో సంభాషణలు జరిగాయి. అనుమతుల్లేకపోవడంతో సీజ్‌ చేయాల్సి వచ్చిందని డీఎస్పీ చెప్పారు. ‘వాహనంపై నిల్చొని మాట్లాడకూడదని రాజ్యాంగంలో ఎక్కడుందో చెప్పండి. చట్టాల్ని రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేయకూడదు. జీవో 1 అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. సీఎం జగన్‌ నిరక్షరాస్యుడు. అతడికి అవగాహన లేక జీవో1ను తీసుకొచ్చాడు. మీరు కూడా అలానే చేస్తే ఎలా? నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పాదయాత్ర చేసుకుంటున్నాను. నన్నూ ఇబ్బంది పెట్టొద్దు. నా వాహనాన్ని ఇచ్చేవరకు నేను ముందుకు కదలను. ఇప్పుడు ప్రచార రథం మీద ఎక్కి మాట్లాడానని వాహనాన్ని సీజ్‌ చేశారు. నిన్న, మొన్నా కుర్చీలు, స్టూళ్ల మీద మాట్లాడాను. వాటిని కూడా సీజ్‌ చేయండి. పలమనేరు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని వాహనంపై నుంచి మాట్లాడాను. ప్రజలు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాహనంపై కాకుండా చెట్టుపైకి ఎక్కి మాట్లాడాలా? జగన్‌ పాదయాత్ర చేసేటప్పుడు ఇలాంటి సభలు ఎన్నో జరిగాయి. మీరంతా అప్పుడేం చేస్తున్నారు. మొన్న బైరెడ్డిపల్లెలో నా పాదయాత్ర అయిపోయాక టీడీపీ ఫ్లెక్సీలను కాల్చేశారు. అయినా సంయమనం పాటించాను. మీరు సతాయిస్తున్నారు కదా.. మేం కూడా చేస్తాం’ అని లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు.

లోకేశ్‌ సంయమనం

‘పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం. మీరు చెప్పినా చేయడానికైనా సిద్ధం’ అని కార్యకర్తలు లోకేశ్‌ను ప్రోద్బలం చేశారు. ‘అలాంటి పనులు మనం చేయకూడదు. అవసరం లేదు’ అని కార్యకర్తల్ని లోకేశ్‌ నిలువరించారు. డీఎస్పీతో కూడా చాలా సంయమనంతో మాట్లాడారు. తనకున్న హక్కుల గురించి పద్ధతిగా ప్రశ్నించారు. మొన్న బైరెడ్డిపల్లెలోనూ టీడీపీ బ్యానర్లను కాల్చేస్తే సంయమనం పాటించామని డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రచార రథాన్ని సీజ్‌ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘లోకేశ్‌ పేరు చెబితే వైసీపీ నేతలు భయపడుతున్నారు. మాపాటికి మేము ఏడు రోజులుగా పాదయాత్ర చేసుకుంటుంటే వైసీపీ నేతల బాధేంటో నాకు అర్థం కావడం లేదు. జనాల సంఖ్యను బట్టి కుర్చీలు, స్టూళ్ల మీద లోకేశ్‌ మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజలు అధిక సంఖ్యలో ఉండడంతో వాహనంపై ఎక్కి మాట్లాడాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T20:35:24+05:30 IST