Lokesh Padayatra: కనీవినీ ఎరుగని రీతిలో లోకేశ్ పాదయాత్రకు స్పందన... చంద్రబాబు, లోకేశ్‌కు ఒకే సెంటిమెంటు

ABN , First Publish Date - 2023-01-27T20:58:33+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) శుక్రవారం చిత్తూరు జల్లా కుప్పం నుంచి యువగళం (Yuva Galam) పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణం (Kuppam town) లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి...

Lokesh Padayatra: కనీవినీ ఎరుగని రీతిలో లోకేశ్ పాదయాత్రకు స్పందన... చంద్రబాబు, లోకేశ్‌కు ఒకే సెంటిమెంటు

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) శుక్రవారం చిత్తూరు జల్లా కుప్పం నుంచి యువగళం (Yuva Galam) పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణం (Kuppam town) లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, సరిగ్గా 11:03 గంటలకు ఆలయం నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులు 4 వేల కిలోమీటర్లు కాలినడక తిరిగి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇఛ్చాపురంలో ముగియనుంది. లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా తొలిరోజు ఉదయం 10 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఆయన బయటకు వచ్చారు.

లక్ష్మీపురంలోని వరదరాజస్వామి గుడి, మసీదు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాదయాత్ర చేసుకుంటూ కుప్పం బస్టాండు వరకు వెళ్లి అక్కడి అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌, పొట్టిశ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులర్పించారు. మధ్యాహ్నం భోజనానంతరం నేరుగా బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్యారవాన్‌లో రాత్రి బస చేస్తారు. తొలి రోజు లోకేశ్‌ 8.5 కిలోమీటర్లు నడిచారు. రెండో రోజు శనివారం శాంతిపురం మండలంలో 9.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.

కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్రకు స్పందన

తొలి అడుగు వేసే సమయంలో ఆలయం వెలుపల కార్యకర్తలు లోకేశ్‌పై పూలవర్షం కురిపించారు. జైలోకేశ్‌, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna), రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, వేలాది మంది కార్యకర్తలు వెంట నడువగా పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభమయ్యాక దారి పొడవునా మహిళలు హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. చంద్రన్న బిడ్డను చూసేందుకు కుప్పం ప్రజలు ఎగబడ్డారు. మార్గమధ్యంలో గజమాలతో లోకేశ్‌కు అలంకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేశ్‌తో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు. యువగళానికి సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలడాయి. కనివినీరీతిలో పాదయాత్రకు స్పందన కనిపించింది.

లోకేశ్‌కు ఉత్తరాంధ్రలోని 12 నదీ జలాలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత అప్పలనాయుడు ఉత్తరాంధ్ర నదీ జలాలను తీసుకొచ్చి లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న 12 నదీజలాలను తీసుకొచ్చి లోకేశ్‌కు ఇస్తున్నాను. 40 దేవతల దర్శనాలు చేసి, మసీదు, చర్చిలలో ప్రార్థనలు చేసిన జలాలను తీసుకొచ్చాను. అలాగే ఉత్తరాంధ్రలోని మూడు ప్రాంతాల్లో మట్టిని కూడా తీసుకువచ్చి.. లోకేశ్‌కు విజయతిలకం దిద్దుతున్నా’మన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా నందమూరి బాలకృష్ణ

లోకేశ్‌ పాదయాత్రలో రాష్ట్రంలోని టీడీపీ ప్రముఖ నాయకులంతా పాల్గొన్నా.. బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభించేందుకు ముందే వరదరాజస్వామి ఆలయంలో చేసిన పూజల్లో, ఆ తర్వాత లక్ష్మీపురంలోని మసీదులో చేసిన ప్రార్థనల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన్ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. తారకరత్న సొమ్మసిల్లి పడిపోయి ఆసుపత్రిలో చేరడంతో, ఇక బాలకృష్ణ పాదయాత్ర నుంచి వెళ్లిపోయారు. ఆస్పత్రిలోనే ఉంటూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. లోకేశ్‌తో పాటు బాలకృష్ణ కూడా వేదిక మీద పాల్గొని ప్రసంగించాల్సి ఉన్నా, ఆస్పత్రిలోనే ఉండటంతో సభకు రాలేకపోయారు.

అధినేతకు.. యువనేతకు అదే సెంటిమెంటు..

టీడీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాదయాత్ర ఇది. దీన్ని లోకేశ్‌ తన తండ్రికి ఎంతో సెంటిమెంటు అయిన ప్రాంతం నుంచి ప్రారంభించారు. గతంలో అనేకసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటనలు, ర్యాలీలను లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేసే ప్రారంభించారు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసే సమయంలోనూ ఆ పత్రాలను స్థానిక నాయకులు ఇదే గుడిలో పూజలు జరిపిస్తారు. గతంలో కుప్పంలో పర్యటించిన లోకేశ్‌ కూడా ఇక్కడ పూజలు చేశాకే ప్రచారాలు, పర్యటనలు చేసేవారు. శుక్రవారం కూడా తన పాదయాత్రను ఇదే గుడిలో పూజలు చేసి ప్రారంభించారు.

Updated Date - 2023-01-27T21:06:32+05:30 IST