TDP leaders: ఏపీలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతల ఫిర్యాదు
ABN , First Publish Date - 2023-11-29T19:18:19+05:30 IST
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు కలిశారు. సీఈవోతో అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, పయ్యావుల కేశవ్‌తోపాటు ఇతర నేతలు సమావేశమయ్యారు.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు కలిశారు. సీఈవోతో అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, పయ్యావుల కేశవ్‌తోపాటు ఇతర నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు టీడీపీ బృందం పేర్కొంది.
"దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నప్పటికీ కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు. రాప్తాడులో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసినా అనంతపురం కలెక్టర్ పట్టించుకోలేదు. ఉరవకొండలో 10 వేల ఓట్లు వైసీపీ వారి పిర్యాదుతో తొలగించేశారు. రెండు సందర్భాల్లో కలెక్టర్ ఒక్కరే. కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల మార్పు ఈసీ ఆదేశాల ప్రకారం జరగాలి. ఉరవకొండ, చంద్రగిరి, పర్చూరు వంటి 17 నియోజకవర్గాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఫారం -6,ఫారం -7 విషయంలో నోటీసులు ఇవ్వకుండా మార్పులు చేస్తే బీఎల్ఓలను బాధ్యులు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టత ఇచ్చారు. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళం, కోనసీమ, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాల కలెక్టర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు." అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
"బీఎల్ఓ వేరిఫికేషన్ లేకుండానే ఒకేసారి భారీగా ఓట్లు తొలగిస్తున్నారు. ఎమ్మార్వో ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఓట్లు తొలగిస్తున్నారు. అసలు ఈ రోజు అర్థరాత్రి వరకు ఎలక్షన్ కమిషన్ (సి ఈ ఓ) కార్యాలయం లో కూర్చుని ఆందోళన చేయాలని వచ్చాం. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మి విరమించుకుని వెళుతున్నాం." అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు.