Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి

ABN , First Publish Date - 2023-01-28T19:32:18+05:30 IST

తిరుమల (Tirumala)లో రథసప్తమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు ఉదయం నుంచి రాత్రి వరకు...

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమల: తిరుమల (Tirumala)లో రథసప్తమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు ప్రధాన వాహనాలపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తకోటికి అభయమిచ్చారు. 2021 తర్వాత మాడవీధుల్లో రథసప్తమి వాహనసేవలను నిర్వహించిన నేపథ్యంలో భక్తులు భారీగా కొండకు చేరుకుని వాహనసేవలను తిలకించారు. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున తిరుమలలో రథసప్తమి ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా భావించే ఈ ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. శుక్రవారం రాత్రి 7 నుంచే గ్యాలరీల్లో భక్తుల రాక మొదలైన నేపథ్యంలో అర్ధరాత్రికే మాడవీధులు దాదాపుగా నిండిపోయాయి. తీవ్రమైనచలిని కూడా లెక్కచేయకుండా భక్తులు (Devotees) గ్యాలరీల్లో కూర్చుండి పోయారు. శనివారం వేకువజామున 5.30గంటలకు వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనంలో శ్రీవారి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి బయల్దేరి వాయవ్య మూలలోకి వేంచేశారు. సరిగ్గా 6.52 గంటలకు సూర్య కిరణాలు స్వామిని తాకాయి. వెంటనే అర్చకులు శాస్త్రోక్త కైంకర్యాలు జరిపించారు.

అనంతరం వరుసగా చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు రాత్రి దాకా విహరించి భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. కాగా, సూర్యప్రభ వాహనసేవ సమయంలో ప్రత్యేక వేదికలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చదువుకుంటున్న వంద మందికిపైగా విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాడవీధుల్లో వేచివున్న భక్తులకు అన్నప్రసాదాలను, తాగునీటిని టీటీడీ (TTD) అందజేసింది. సూర్యప్రభ వాహన సేవ మొదలుకుని రాత్రి చంద్రప్రభ వాహనం వరకు గ్యాలరీలు భక్తులతో నిండుగా కనిపించాయి.

శ్రీవారి సేవలో తెలంగాణ న్యాయమూర్తులు

తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.న్యాయమూర్తులను రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-01-28T19:32:19+05:30 IST