Narasaraopet: నరసరావుపేటలో ఇతనేం చేశాడంటే.. సీసీ ఫుటేజ్‌ చూశాక ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం బయటికొచ్చింది..!

ABN , First Publish Date - 2023-05-11T13:00:56+05:30 IST

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం తెల్లవారుజామున జంట హత్యలు వెలుగు చూశాయి. రూ.150 కోసం దారుణంగా హతమార్చాడు. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ద్వారా..

Narasaraopet: నరసరావుపేటలో ఇతనేం చేశాడంటే.. సీసీ ఫుటేజ్‌ చూశాక ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం బయటికొచ్చింది..!

వరుస హత్యలతో భయాందోళనలు

సీసీ ఫుటేజ్‌ ద్వారా హంతకుడి గుర్తింపు

గతంలో ఇద్దర్ని హత్య చేసినట్లు ఆధారాలు

రూ.150 కోసం ఇద్దరి హత్య

నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం తెల్లవారుజామున జంట హత్యలు వెలుగు చూశాయి. రూ.150 కోసం దారుణంగా హతమార్చాడు. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ద్వారా గుర్తించారు. సైకోగా భావిస్తున్న వ్యక్తి చేసిన వరుస హత్యలతో పట్టణవాసులు భయాందోళనకు గురౌతున్నారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులో జరిగిన రెండు హత్యలు కలకలం సృష్టించాయి. వేర్వేరు చోట్ల మృతదేహాల సమాచారం అందుకున్న పోలీసులు, మద్యం తాగి కింద పడడంతో మృతి చెంది ఉంటారని తొలుత భావించారు. అయితే ఎస్పీ రవిశంకరరెడ్డి రంగంలోకి దిగి సీసీ కెమేరాల ఫుటేజ్‌లను పరిశీలించి హత్యలుగా తేల్చారు.

సేకరించిన సమాచారం మేరకు.. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో రక్తపు గాయాలతో ఇద్దరు పడి ఉన్నట్లు పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ మృతదేహాలను చూసి మద్యం మత్తులో కింద పడి తీవ్రంగా పడి మృతి చెంది ఉంటారని తొలుత భావించారు. అయితే రెండు మృతదేహాలపై ఒకేరకమైన గాయలు ఉండటంతో అనుమానస్పద మృతిగా భావించారు. ఎస్పీ రంగంలోకి దిగి సంబంధిత మార్గంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. దీంతో ఈ ఇద్దరివి సాధారణ మృతి కాదని హత్యలను తేల్చారు. గంటల వ్యవధిలోనే నిందితుడు తన్నీరు అంకమ్మరావుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన సంపత్‌రెడ్డి(45) ఇంట్లో అలిగి వచ్చి స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులో నిద్రించాడు. ఇతడి వద్ద రూ.30 తీసుకున్న అంకమ్మరావు బండరాయితో మోది హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 120 నగదు తీసుకుని అదే రీతిలో బండ రాయితో తలపై మోది హతమార్చాడన్నారు. ఈ రెండు ఘటనలతో ఈ నెల 5న రూ.400 కోసం ఓ యాచకురాలి హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ కేసులోనూ అంకమ్మరావే నిందితుడని నిర్ధారించారు.

గతంలోనూ ఇదే రీతిలో..

అంకమ్మరావు గతంలో కూడా ఇదే తరహాలో పట్టణంలో ఇద్దర్ని హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇతడు సైకో అని పోలీసులు భావిస్తున్నారు. ఒక హత్య కేసులో సాక్ష్యాధారాలు లేక తప్పించుకున్నాడు. అయితే పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వహించిన నిర్లక్షమే తాజాగా ఇద్దరి హత్యకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంకమ్మరావుపై 13 చోరీలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మూడు కేసుల్లో నలుగుర్ని హత మార్చాడన్నారు. గత ఏడాది జూన్‌లో పట్టణంలోని గీతా మందిర్‌ రోడ్డులో నగదు కోసం ఓ మహిళను హత మార్చాడన్నారు. సదరు కేసులో సాక్షాధారాలు లేకపోవడంతో ఈ ఏడాది మార్చి 27న జైలు నుంచి బయటకు వచ్చాడన్నారు. ఈ నెల 5న పట్టణంలోని మార్కెట్‌ సెంటర్‌లో యాచకురాలిని హతమార్చాడన్నారు.

Updated Date - 2023-05-11T13:01:02+05:30 IST