Share News

Pothina Venkata Mahesh: పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే.. మహిళలే జగన్‌ని తరిమి కొడతారు

ABN , Publish Date - Dec 29 , 2023 | 08:36 PM

జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వస్తే చాలు.. అధికార వైసీపీ నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు తెగబడతారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. రాష్ట్రానికి అదేదో ఆపద వచ్చిపడినట్టు, రాష్ట్రాభివృద్ధి ఆగిపోయినట్టు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి...

Pothina Venkata Mahesh: పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే.. మహిళలే జగన్‌ని తరిమి కొడతారు

Pothina Venkata Mahesh: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వస్తే చాలు.. అధికార వైసీపీ నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు తెగబడతారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. రాష్ట్రానికి అదేదో ఆపద వచ్చిపడినట్టు, రాష్ట్రాభివృద్ధి ఆగిపోయినట్టు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే మాట్లాడుతుంటారు. చివరికి సీఎం జగన్‌మోహన్ రెడ్డి సైతం ఎన్నోసార్లు పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి ‘కార్లను మార్చినట్లు పవన్ భార్యలను మారుస్తాడని’ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తాడని పేర్కొన్నారు. ఇందుకు జనసేన నేత పోతిన వెంకట మహేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


సీఎం జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే మతిభ్రమించి పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తుతో జగన్ ఓటమి ముందే ఖరారు అయ్యిందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేస్తూ.. రాజకీయ విలువలను తుంగలోకి తొక్కుతున్నారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో అస్సలు విలువ లేని వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. చంచల్‌గూడ స్టార్, దరిద్ర పుత్రుడు, మార్ట్‌గేజ్ స్టార్, అప్పుల అప్పారావు లాంటి పేర్లు జగన్‌కు కచ్చితంగా సరిపోతాయని ఎద్దేవా చేశారు. సొంత కుటుంబంలోని మహిళల్ని ఆట వస్తువుగా చూస్తూ.. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని ఇంట్లోంచి గెంటేసిన వ్యక్తి జగన్ అని తూర్పారపట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేక ఎడారిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే.. రాష్ట్రంలోని మహిళలే జగన్‌ను తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు.

అంతకుముందు.. భీమవరంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధుల విడుదల సందర్భంగా పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్‌లో పవన్ ఏ భార్యతోనూ ముచ్చటగా 3, 4 ఏళ్లైనా కాపురం చేసి ఉండడని.. ఈ మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూస్తాడని, పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతున్నాడని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, మళ్లీ పెళ్లి.. ఇలా కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. ఇలాంటి వాళ్లు ముఖ్యమంత్రులైతే.. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ ఆయన మాదిరిగానే పెళ్లిళ్లు పెళ్లిళ్లు చేసుకుంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే పోతిన వెంకట మహేష్ పై విధంగా విరుచుకుపడ్డారు.

Updated Date - Dec 29 , 2023 | 08:36 PM