MLC Elections: సిక్కోలులో ‘స్థానిక’ ఎమ్మెల్సీగా నర్తు రామారావు విజయం

ABN , First Publish Date - 2023-03-16T20:59:33+05:30 IST

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు (Rama Rao) గెలుపొందారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌..

MLC Elections: సిక్కోలులో ‘స్థానిక’ ఎమ్మెల్సీగా నర్తు రామారావు విజయం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు (Rama Rao) గెలుపొందారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల నుంచి 776 ఓట్లు ఉండగా, 752 మంది ప్రజాప్రతినిధులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో నర్తు రామారావుకు 632 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఆనెపు రామకృష్ణ (Ramakrishna)కు 108 ఓట్లు లభించాయి. 12 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. రిటర్నింగ్‌ అధికారి సారధ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులను బయటకు తీసి.. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు నర్తు రామారావుకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఫలితం ఊహించిదే

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఊహించనట్టుగానే వచ్చినప్పటికీ.. ఇండిపెండెంట్‌ అభ్యర్థికి 100కుపైగా ఓట్లు రావడం అధికార పక్షానికి మింగుడు పడడంలేదు. జిల్లాలో దాదాపు 90 శాతం మంది వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులే ఉన్నారు. ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నేత నర్తు రామారావుకు వైసీపీ అధిష్టానం ఎంఎల్‌సీ టికెట్‌ ఖరారు చేసింది. స్థానిక సంస్థల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇస్తారని భావించినప్పటికీ.. పార్టీ అధిష్టానం యాదవ కులానికి చెందిన నర్తు రామారావుకు టిక్కెట్‌ కేటాయించింది. దీంతో బూర్జ మండలానికి చెందిన ఆనెపు రామకృష్ణ ఇండిపెండెంట్‌గా ఎన్నిక బరిలో నిలిచారు. దీంతో ఏకగ్రీవమవుతుందనుకున్న ఎన్నిక కాస్తా పోటీ అనివార్యమైంది. జిల్లా మొత్తమ్మీద 776 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓటు హక్కు ఉండగా, ఇందులో 752 మంది మాత్రమే ఓటును వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన పలువురు ప్రతినిధులు ఓటేసేందుకు ఆసక్తి చూపకపోగా.. ఒకరిద్దరూ వైసీపీ ప్రతినిధులు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. 90 శాతానికి పైగా అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నా.. ఇండిపెండెంట్‌ అభ్యర్ధికి 108 ఓట్లు రావడం గమనార్హం. ఏ ప్రాంతం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఓట్లు పోలాయ్యాయోనని అధికార పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు.

Updated Date - 2023-03-16T20:59:33+05:30 IST