‘గట్టు’ గుల్ల!

ABN , First Publish Date - 2023-03-31T02:44:07+05:30 IST

‘కర్నూలులోని జగన్నాథగట్టులో ఎర్రమట్టి అక్రమ క్వారీ, రవాణా వాస్తవమే’’నని రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టరుకు కర్నూలు జిల్లా మైన్స్‌ అధికారులు ఈ నెల ఆరో తేదీన నివేదిక ఇచ్చారు.

‘గట్టు’ గుల్ల!

జగన్నాథగట్టుపై తవ్వకాలు నిజమే.. ‘ఆంధ్రజ్యోతి’ కథనం అక్షరసత్యం

మైనింగ్‌ అధికారుల నివేదికదీ అదే మాట

రాత్రివేళల్లో ఎర్రమన్నును తవ్వేస్తున్నారు

ఇప్పటికే 1,71,308 క్యూబిక్‌ మీటర్ల తవ్వకం

గట్టుపై పలు విద్యాసంస్థలకు భూములు

ఇక్కడే పేదలకు ఇళ్లు, జర్నలిస్టులకు స్థలాలు

వాటిల్లోకీ చొచ్చుకువస్తున్న అక్రమ మైనింగ్‌

ఎర్రమట్టి క్వారీపై నిషేధం విధించండి

మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌కు నివేదన

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ‘‘కర్నూలులోని జగన్నాథగట్టులో ఎర్రమట్టి అక్రమ క్వారీ, రవాణా వాస్తవమే’’నని రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టరుకు కర్నూలు జిల్లా మైన్స్‌ అధికారులు ఈ నెల ఆరో తేదీన నివేదిక ఇచ్చారు. జగన్నాథగట్టును గుల్ల చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని ఈ నివేదిక తేల్చేసింది. ఏ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనేది తమ నివేదికలో అధికారులు కళ్లకు కట్టారు. ‘‘రాత్రి వేళల్లో, సెలవు దినాల్లో కూడా ఎక్స్‌కవేటర్లతో ఎర్ర గరుసును (మట్టి) తవ్వేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల నుంచి జగన్నాథ గట్టును రక్షించాలంటే అండర్‌ రూల్‌ 11 ఆఫ్‌ ఏపీఎంఎంసీ రూల్స్‌, 1966 ప్రకారం ఎర్రమట్టి క్వారీపై నిషేధ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే’’నని తేల్చేశారు. ఆ నివేదిక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత కూడా యథేచ్ఛగా జగన్నాథగట్టును గునపం దెబ్బలు తొలుస్తూనే ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే... కర్నూలు నగర శివార్లో కల్లూరు మండలం లక్ష్మీపురం రెవిన్యూ గ్రామ సర్వే నంబరు 793-1లో 590, కర్నూలు రూరల్‌ మండలం దిన్నెదేవరపాడు రెవిన్యూ గ్రామం సర్వే నంబరు-478లో వందల ఎకరాల విస్తీర్ణంలో జగన్నాథ గట్టు ఉంది. నాణ్యమైన ఎర్రమట్టి (గరుసు) నిక్షేపాలకు ఇది నిలయం. కర్నూలు-నంద్యాల రహదారి పక్కనే ఉన్న ఈ గట్టు పరిధిలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీడీఎం) కళాశాలకు 200 ఎకరాలు, లా యూనివర్సిటీకి 250 ఎకరాలు, సిల్వర్‌ బూబ్లీ క్లస్టర్‌ యూనివర్సిటీకి 120 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటూ సీఎం జగన్‌, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుండడంతో.. జగన్నాథగట్టుపై హైకోర్టు ఏర్పాటుకు కర్నూలు కలెక్టర్‌ ప్రతిపాదించారు. సర్వే నంబరు-478లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం 15.44 ఎకరాలు కేటాయించారు. 2005-06లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకు 8,500 ఇందిరమ్మ ఇళ్లు కట్టించారు. 2017-18లో నాటి సీఎం చంద్రబాబు ఏపీ టిడ్కోకు 319 ఎకరాలు కేటాయించి 10 వేల జీ+3 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.

అయినా... ఆగని అక్రమాలు

ఎంతో ప్రాధాన్యత, విలువైన భూములు కలిగిన జగన్నాథగట్టు సంరక్షణ బాధ్యతను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ధనార్జనే ధ్యేయంగా అధికారం మాటున ఎర్రమట్టి మాఫియా పెట్రేగిపోతోంది. ఎక్స్‌కవేటర్లతో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తూ రవాణా చేస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీడీఎం కళాశాల, జర్నలిస్టులకు కేటాయించిన భూముల్లోనూ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారంటే.. ఎర్రమట్టి మాఫియా ఏస్థాయిలో బరితెగించిందో అర్థమవుతోంది. ఈ భాగోతాన్ని గత నవంబరులో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టరు స్పందించారు. అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించి.. రక్షణ చర్యలు తీసుకోవాలని కర్నూలు మైనింగ్‌ డీడీ టి.రాజశేఖర్‌కు నోటీసులు జారీచేశారు. ఆయన ఆదేశాల మేరకు మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారుల బృందాలు జగన్నాథగట్టులో క్షేత్రస్థాయిలో సమ గ్ర సర్వే చేశాయి. ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమేనని తేల్చాయి. నివేదిక తయారీనాటికి 1,71,308 క్యూబిక్‌ మీటర్లు అక్రమంగా తవ్వకాలు చేసినట్లు నిగ్గుతేల్చాయి. అక్రమంగా తవ్వకాలు చేస్తున్న 8మందిని గుర్తించారు. రాయల్టీ, అపరాధ రుసుం, డీఎంఎ్‌ఫ(డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌), ఎంఈఆర్‌ఐటీ కలిపి రూ.9,49,73,155 చెల్లించాలని అక్రమ క్వారీదారులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. కొన్ని వాహనాలు సీజ్‌ చేశారు. ఎర్రమట్టి అక్రమ తవ్వకాలను నిరోధించాలని ఎస్పీని కలసి ఫిర్యాదుచేశారు. ఎస్పీ సూచనతో అక్రమ తవ్వకందారులకు పోలీస్‌, మైనింగ్‌, రెవెన్యూ విభాగాల అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అయినా, ఈ చర్యలేవీ పని చేయలేదు. జగన్నాథగట్టులో యథేచ్ఛగా అక్రమంగా ఎర్రమట్టి తవ్వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-31T02:44:07+05:30 IST