AP News: రాజధాని కేసులు తక్షణమే విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు ఏపీ లేఖ

ABN , First Publish Date - 2023-02-04T14:59:51+05:30 IST

రాజధాని కేసులు (Capital Cases) తక్షణమే విచారించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt.) సుప్రీంcకోర్టు (Supreme Court) రిజిస్ట్రారుకు లేఖ (Letter) పంపింది.

AP News: రాజధాని కేసులు తక్షణమే విచారించాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు ఏపీ లేఖ

అమరావతి: రాజధాని కేసులు (Capital Cases) తక్షణమే విచారించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt.) సుప్రీంcకోర్టు (Supreme Court) రిజిస్ట్రారుకు లేఖ (Letter) పంపింది. ఈ మేరకు వెంటనే మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీంకోర్టులోని అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ మెహఫూజ్ నజ్కీ రిజిస్ట్రారుకు లేఖ పంపారు. ఈనెల 6వ తేదీ ఉదయం మెన్షన్ లిస్టులో చేర్చాలని నజ్కీ రిజిస్ట్రారును అభ్యర్ధించారు.

హైకోర్టు (High Court) త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28వ తేదీన జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. 31వ తేదీన బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటీషన్‌ను ఈ నెల 6వ తేదీన మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.

కాగా ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో వారం రోజుల క్రితం మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివ రామకృష్ణ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, రైతులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అయితే రాజధాని అంశానికి సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా ఇటీవల ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని విశాఖ అంటూ ప్రకటన చేశారు. ఆయన మాటల్లో... ‘‘రానున్న రోజుల్లో రాష్ట్ర రాజధాని కానున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరికొద్దినెలల్లో నేను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నాను. ఈ ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడమే కాకుండా మా రాష్ట్రంలో వ్యాపారం చేయడం ఎంత సులభమో విదేశాల్లో ఉన్న మీ సహచరులకు కూడా చెప్పి.. తీసుకురండి’’ అంటూ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-04T14:59:54+05:30 IST