KA Paul: వివేకా హత్యకేసులో న్యాయం జరగలేదు: కేఏ పాల్

ABN , First Publish Date - 2023-02-05T18:39:49+05:30 IST

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో న్యాయం జరగలేదని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ (KA Paul) విమర్శించారు...

KA Paul: వివేకా హత్యకేసులో న్యాయం జరగలేదు: కేఏ పాల్

హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో న్యాయం జరగలేదని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ (KA Paul) విమర్శించారు. అమెరికాలో అయితే రోజుల్లోనే న్యాయం జరిగేదని తెలిపారు. నాలుగేళ్లయినా ఈ కేసులో న్యాయం జరగలేదని తప్పుబట్టారు. ఒక మాజీ మంత్రిని హత్య చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోంది? అని కేఏ పాల్ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఇటీవల కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి సన్నిహిత బంధువు, ఎంపీ అవినాశ్‌ రెడ్డి (MP Avinash Reddy)ని ప్రశ్నించిన సీబీఐ అధికారులు... సీఎం జగన్‌ ఓఎస్డీని, సతీమణి భారతి (Bharthi) వద్ద సహాయకుడిగా పనిచేసే నవీన్‌ను ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సుమారు ఆరున్నర గంటలపాటు ఈ విచారణ జరిగింది. గత నెల 28వ తేదీన అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో విచారించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన కాల్‌డేటా కీలకంగా మారింది. వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజున, ఆ తర్వాత... భారతితో మాట్లాడేందుకు నవీన్‌కు, జగన్‌తో మాట్లాడేందుకు మరో నంబర్‌కు అవినాశ్‌ రెడ్డి పలుమార్లు కాల్‌ చేసినట్లు ఆ విచారణలో తేలింది. ఆ మరో వ్యక్తి ఇంకెవరో కాదని... జగన్‌ (Jagan) ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డేనని స్పష్టమైంది.

సీబీఐకి కేఏ పాల్ లేఖ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం (Secretariat)లో అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు కోరుతూ సీబీఐకి కేఏ పాల్ లేఖ రాశారు. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మంటలు ఎగసిపడ్డాయి. భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు క్రమంగా పైకి వ్యాపించాయి. ఆరో అంతస్తు వరకు ఎగసిపడ్డాయి. అనంతరం పై డోమ్‌ల నుంచి దట్టమైన పొగ వెలువడింది. వెనకభాగంలోని ఒక గుమ్మటం నల్లగా మారిపోయింది. తెల్లవారుజామున, మంచు కురుస్తున్న సమయంలోనూ అంత పెద్దఎత్తున పొగలు వచ్చాయంటే లోపల ప్రమాద తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అగ్నిప్రమాద విషయాన్ని అక్కడి సిబ్బంది ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు. స్పందించిన సీఎంవో ప్రమాద తీవ్రతను తెలుసుకుని, వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Updated Date - 2023-02-05T18:39:50+05:30 IST