Infosys: 28న విశాఖలో ఇన్ఫోసిస్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-24T20:14:01+05:30 IST

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఎట్టకేలకు ఈ నెల 28వ తేదీ నుంచి విశాఖపట్నం (Visakhapatnam)లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది.

Infosys: 28న విశాఖలో ఇన్ఫోసిస్‌ ప్రారంభం

విశాఖపట్నం: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఎట్టకేలకు ఈ నెల 28వ తేదీ నుంచి విశాఖపట్నం (Visakhapatnam)లో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. ఆర్థిక మండలిలో ఉంటే ఉత్పత్తులను తప్పనిసరిగా ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఇంకా స్థానికంగా వ్యాపారం చేయడానికి ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకని ఆర్థిక మండలి పరిధిలోకి రాని ప్రాంతం (నాన్‌ సెజ్‌ ఏరియా)లో కార్యాలయం ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుని, ఆ మేరకు భవనం కోసం అన్వేషించింది. రుషికొండ ఐటీ పార్కులోనే నాన్‌ సెజ్‌ ఏరియా ఉండడంతో అక్కడ ఓ భవనాన్ని ఎంపిక చేసుకొని ఇంటీరియర్‌ పనులు పూర్తి చేసుకుంది. మొదట జూలై ఒకటో తేదీన ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. విశాఖ కార్యాలయంలో పనిచేయడానికి కొత్తగా ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. ఈ రీజియన్‌లో ఇన్ఫోసిస్‌ కోసం పనిచేస్తున్న వారినే ఈ కార్యాలయం నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో 700 సీటింగ్‌ సామర్థ్యంతో ప్లగ్‌ అండ్‌ ప్లే సౌకర్యాలు ఉన్నాయి. షిఫ్టుల వారీగా తొలుత వేయి మందితో పనిచేయించుకోవాలనే ప్రణాళిక రూపొందించుకున్నట్టు సమాచారం. దశల వారీగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. తొలుత ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకొని నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఆ తరువాత వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. భవనం ప్రారంభోత్సవ సమయంలో కంపెనీ ప్రణాళికలు వెల్లడిస్తారని ఐటీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-06-24T20:14:01+05:30 IST