AP News: గుంటూరు ఎమ్మెల్యే - మేయర్ మధ్య విభేదాలు... రంగంలోకి ఎంపీ అయోధ్య
ABN , First Publish Date - 2023-06-28T11:08:53+05:30 IST
జిల్లా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
గుంటూరు: జిల్లా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా (MLA Mustaffa), మేయర్ కావటి మనోహర్ నాయుడు (Mayor Kaveti Manohar Naidu) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఎంపీ అయోధ్య రామిరెడ్డి (MP Ayodhya Rami Reddy) రంగంలోకి దిగారు. తాను చెప్పిన పనులు నగరపాలక సంస్థ అధికారులు చేయటం లేదని ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. పనులు కాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు చేస్తున్నారని ముస్తఫా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఎంపీ... ఇద్దరు నేతలను వెంట పెట్టుకుని నగరంలో సమస్యలు నెలకొన్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మేయర్, ఎమ్మెల్యే, అధికారులతో కలిసి ఎంపీ అయోధ్య రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే సమస్య వచ్చిందని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ సమస్యలు పరిష్కరించాలని ఇరువురు నేతలకు ఎంపీ అయోద్య రామిరెడ్డి సూచనలు చేశారు.
కార్పోరేషన్‌లో సమావేశం ముగిసిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. బీఆర్ స్టేడియం అభివృద్ధిపై చర్చించామని.. నందివెలుగు రోడ్డులో రైల్వే వంతెన పనులపై ఎమ్మెల్యే కొన్ని సూచనలు చేశారని తెలిపారు. పీకల వాగు అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. అభివృద్ధి కూడా అన్ని ప్రాంతాల్లో వేగవంతం చేయాలని ఎంపీ సూచించినట్లు చెప్పారు. ఎంపీ సూచనలకు అనుగుణంగా పని చేస్తామని తెలిపారు. నగరంలోని రైల్వే వంతెనలు పూర్తి చేయడంపై కూడా చర్చించామన్నారు.
ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ... తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు గురించి ఎమ్మెల్యే ముస్తఫా అడగటం జరిగిందని.. వాటిపై కూడా సమీక్షించామన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని చెప్పామని తెలిపారు. పార్టీలో నేతలందరూ పేద ప్రజల కోసం పని చేస్తున్నారని.. నేతల మధ్య అభిప్రాయ బేధాలు లేవని స్పష్టం చేశారు. ఎవరి పరిధిలో వాళ్ళు అభివృద్ధి చేయాలన్న తపనతో ఉన్నారన్నారు. అందరూ కలిసే ఉన్నామని వెల్లడించారు.
ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ.. నేతల మధ్య విబేధాలు ఏమీ లేవన్నారు. టూ టౌన్ మురుగు అంతా వన్ టౌన్ నుంచి వెళ్తుందన్నారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి అండగా ఉంటామని చెప్పారన్నారు. పనులు జరుగుతాయని భావిస్తున్నానని.. తనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పుకొచ్చారు.