CM Jagan: నేడు గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్

ABN , First Publish Date - 2023-06-02T09:18:51+05:30 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలో వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2 కార్యక్రమంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.

CM Jagan: నేడు గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలో వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2 కార్యక్రమంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి చుట్టుగుంటలో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2 వద్దకు చేరుకుని రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.

కాగా ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే జనం ఆనందం మాట మరిచి ఆందోళన చెందుతున్నారు. ఆయన వచ్చి వెళ్లే వరకే కాకుండా ఒక రోజు ముందు నుంచి ఆ ప్రాంతంలో రహదారుల నుంచి దుకాణాల వరకూ అన్నీ బందు చేయాల్సి వస్తుంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక దుకాణాల మూతతో నష్టపోతున్నామని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. శుక్రవారం ఉదయం గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో జరిగే ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానున్నారు. ఈ సందర్భంగా గురువారం నుంచే ఆ ప్రాంతంలో అధికారులు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం చుట్టుగుంట సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొననున్న దృష్ట్యా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి వేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడింగ్‌ చేసి అన్ని దారులు మూసేయాలని నిర్ణయించారు. సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే మార్గంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో వాటికి శుక్రవారం ఉద్యోగులు చేరుకోవడానికి ఎన్ని ప్రయాసలు పడాల్సి ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

సీఎం కార్యక్రమం జరిగే వేదిక చుట్టుగుంట సెంటర్‌లో చిలకలూరిపేట రోడ్డు వైపున ఉంటుంది. నల్లపాడు రోడ్డులో ఉన్న రైతుబజార్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ శుక్రవారం రైతుబజార్‌ మూసేయాలని మూడు రోజుల క్రితమే మార్కెటింగ్‌ అధికారుల ద్వారా వ్యాపారులకు చెప్పించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు చుట్టుగుంట సెంటర్‌లోని అన్ని దుకాణాలు మూసి ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వల్ల ఆ రోజున పరిసర ప్రాంతాల ప్రజలు కూరగాయల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లక తప్పదు. అయితే చుట్టుగుంట మొదలుకుని అంతా బ్యారికేడింగ్‌ చేస్తోన్నందున కార్పొరేషన్‌ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాలి. ఇక చుట్టుగుంట సెంటర్‌లో షాపులన్నీ గురువారం సాయంత్రం నుంచే మూసేయించారు. ఆఖరికి రోడ్డు పక్కన చిరువ్యాపారులను కూడా అధికారులు వదల్లేదు. కొబ్బరి బోండాలు, తాటిముంజలు విక్రయించే వారిని కూడా ఖాళీ చేయించారు. అసలే వ్యాపారాలు లేక డీలా పడిన వ్యాపారులపై మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రెండు రోజులు నష్టం వాటిల్లనుంది. పరేడ్‌గ్రౌండ్‌ నుంచి ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో ఉన్న చుట్టుగుంట వరకు బ్యారికేడింగ్‌ చేసి ఎవ్వరిని అనుమతించకుండా చేస్తారు. దీని వల్ల టుబాకో బోర్డు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, డీఆర్‌డీఏ, జిల్లాపరిషత్తు, అటవీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, సాంఘిక సంక్షేమం తదితర శాఖల ఉద్యోగులు సకాలంలో ఆఫీసులకు చేరుకోవాలంటే ఎన్నో తిప్పలు పడాల్సి ఉంటుంది. అలానే ఐటీసీ కార్పొరేట్‌ ఆఫీసుకు ఆ సంస్థ సిబ్బంది చేరుకోవాలన్నా ఇబ్బందే.

Updated Date - 2023-06-02T09:18:51+05:30 IST