అదే జోరు అలుపెరగని పోరు

ABN , First Publish Date - 2023-03-31T03:00:39+05:30 IST

రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహోద్యమం శుక్రవారం నాటికి 1200 రోజులకు చేరుకుంటోంది.

అదే జోరు అలుపెరగని పోరు

అమరావతి మహోద్యమంలో మరో మైలురాయి ..1200వ రోజుకు రైతుల పోరాటం

త్యాగాలు, ఆత్మ బలిదానాలతో సాగిన సమరం

గుంటూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చి దగా పడిన రాజధాని రైతులు, మహిళలు, ప్రజలు సాగిస్తున్న మహోద్యమం శుక్రవారం నాటికి 1200 రోజులకు చేరుకుంటోంది. నమ్మిన నాయకుడు నయవంచన చేయడంతో విధిలేని పరిస్థితిలో మొదలైన అన్నదాతల ఉద్యమం వారి పోరాటం, త్యాగాలు, ఆత్మబలిదానాలతో రాష్ట్ర ప్రజలందరి ఉద్యమంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు, రైతుకూలీలు, దళిత బహుజనులు, మైనారిటీలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పోలీసుల నిర్బంధాలు, కవాతులు, లాఠీల కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు.. ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయా యి.

పోరాటానికి నాంది ఇలా..

అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలోని 34,322 ఎకరాలను 29,881 మంది రైతులు భూసమీకరణ కింద ఇచ్చారు. వారిలో ఐదెకరాలలోపు వారు 8,500 మంది ఉన్నారు. ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది. రాజధాని నిర్మాణంపై ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న క్రమంలో.. 2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన మూడు రాజధానుల ఆలోచన వారికి శరాఘాతమైంది. ఆ మర్నాడే అంటే 2019 డిసెంబరు 18న రాజధాని ఉద్యమం ఊపిరిపోసుకుంది.

‘న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర’

2021 నవంబరు 1న చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అమరావతి ప్రజలందరి రాజధాని అని ప్రపంచానికి చాటింది. నవంబరు 1న హైకోర్టు నుంచి డిసెంబరు 17న తిరుమల తిరుపతి దేవస్థానం వరకూ 57 రోజుల పాటు రైతులు పాదయాత్ర చేపట్టారు.

చారిత్రక తీర్పు

మార్చి 4న హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధిచేసి ఇవ్వాలని, ఆర్నెల్లలోగా రాజధానిలో మౌలిక వసతుల కల్పన పూర్తిచేయాలని సూచించింది. కానీ ప్రభు త్వం మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమం లో రాజధాని ఉద్యమం మార్చి 31 నాటికి 1200 రోజులకు చేరుకోనుంది. ఈ సందర్భంగా రాజధాని ఉద్యమ స్ఫూర్తిని తెలియజేస్తూ మందడం శిబిరంలో ‘దగాపడ్డ రైతులు- దోపిడీకి గురవుతున్న ఆంధ్ర ప్రజలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దళిత జేఏసీ, మైనార్టీ జేఏసీ, రాజధాని ఐక్య కార్యచరణ సమితి, అమరావతి పరిరక్షణసమితి సంయుక్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నేతలతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Updated Date - 2023-03-31T03:00:39+05:30 IST