Bopparaju Venkateshwarlu: ఇక ఉద్యమాన్ని విరమిస్తున్నాం..

ABN , First Publish Date - 2023-06-08T16:37:13+05:30 IST

ఉద్యమం చేయకపోతే ఉద్యోగుల ప్రయోజనాలు ఉండవని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju Venkateshwarlu: ఇక ఉద్యమాన్ని విరమిస్తున్నాం..

గుంటూరు: ఉద్యమం చేయకపోతే ఉద్యోగుల ప్రయోజనాలు ఉండవని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Amaravati Chairman Bopparaju Venkateshwarlu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా చాలా సమయం ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరినా అమలు చేయలేదని.. ఒప్పందాలు అమలు చేయకపోగా దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని మండిపడ్డారు. 92 రోజుల పాటు ఉద్యమం చేసి హక్కులు సాధించుకున్నామని తెలిపారు. అన్ని సమన్వయం చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలతో ఉద్యమించామన్నారు. 26 జిల్లాలలో ఒకేసారి ఉద్యమం ప్రారంభించామని చెప్పారు. కారుణ్య నియామకాలు ఉద్యమ ఫలితమే అని తెలిపారు. గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల టార్గెట్ రద్దు చేశారని.. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని ఆయన విమర్శించారు.

ఉద్యమ ఫలితంగా పోలీసుల టీఏ విడుదల చేశారన్నారు. 4 డీఏలు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని ప్రభుత్వం చెప్పిందని.. మన కోరికలు వేరు ప్రభుత్వ ఆలోచన వేరన్నారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిందన్నారు. 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఉద్యోగులు అడగలేదని... రాష్ట్ర అర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ పెంచిందన్నారు. పాత పెన్షన్ విధానం కోసం పోరడతామని స్పష్టం చేశారు. ఉద్యమాలు చేయడానికి మిగతా సంఘాలు కలసి రావని.. పైగా తమ సంఘాన్ని ఆడిపోసుకుంటున్నారన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతింటుంది అనడం అర్థ రహితమన్నారు. వాట్సప్ ఉద్యమం ద్వారా ఏమీ సాధింలేమన్నారు. 47 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచితే 32 డిమాండ్లు పరిష్కరించిందన్నారు. ఈ ఉద్యమాన్ని ఇక విరమిస్తున్నామని చెప్పారు. తీవ్రంగా నష్టపోయింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని... త్వరలోనే అవుట్ సోర్సింగ్ సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇక అమరావతి జేఏసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్‌కు, ఏపీ చీఫ్ సెక్రటీకీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిజేశారు. రాష్ట్రంలో 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Updated Date - 2023-06-08T16:37:13+05:30 IST