Venkaiahnaidu: దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న మాజీ ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2023-06-10T11:41:29+05:30 IST

దేశంలో అవినీతి పెరిగిపోయిందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆంధ్ర లయోల కాలేజ్ ఆడిటోరియంలో శ్రీధర్స్ సీసీఈ విజయోత్సవ సభలో వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Venkaiahnaidu: దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న మాజీ ఉపరాష్ట్రపతి

విజయవాడ: దేశంలో అవినీతి పెరిగిపోయిందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Former Vicepresident Muppavarapu Venkaiah Naidu) అన్నారు. శనివారం ఆంధ్ర లయోల కాలేజ్ ఆడిటోరియంలో శ్రీధర్స్ సీసీఈ విజయోత్సవ సభలో వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరూ నీతివంతంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి అవుతుందని తెలిపారు. అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. పాశ్చాత్య దేశాల ఆహారానికి అలవాటు పడటం ఆరోగ్యానికి మంచిది కాదని.. భారతదేశ ఆహార అలవాటులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సెల్‌ఫోన్‌కు యువత బానిస కాకూడదన్నారు. వ్యాయామం శరీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టానని.. చదువు, వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లానని... అది నా జీవితాన్ని మార్చేసిందన్నారు. లాయర్ అవ్వాలి అనుకున్న తాను రాజకీయ నాయకుడిని అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పనిచేసే ప్రాంతంలో, విద్యాలయాల్లో ఎక్కువ మంచి స్నేహితులను సంపాదించుకోవాలన్నారు. మాతృభూమిని, మాతృభాషని మరిచిపోయేవాడు మానవుడే కాదన్నారు. తెలుగు భాష కళ్ళు అయితే ఇంగ్లీష్ భాష కళ్లద్దాలు వంటివని తెలిపారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, సంప్రదాయాల పై అవగాహన పెంచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Updated Date - 2023-06-10T11:41:29+05:30 IST