Voters List : డోర్‌ నంబర్‌ 0

ABN , First Publish Date - 2023-07-25T01:49:58+05:30 IST

రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో ఇంటి నంబర్ల వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. ఓటర్ల జాబితాల్లో సుమారు నాలుగు లక్షల ఇళ్లకు డోర్‌ నంబర్లు కనిపించకపోవడంతో, వీటి వెనుక ఉన్న మతలబు ఏమిటని రాజకీయ పార్టీలు ఆరా తీయడం మొదలు పెట్టాయి.

Voters List : డోర్‌ నంబర్‌ 0

ఓటర్ల జాబితాల్లో అలాంటి 4 లక్షల ఇళ్లు

దొంగ ఓట్లా? నిజంగానే ఇంటి నంబర్లు లేవా?

ఎన్నికల కమిషన్‌కు భారీగా ఫిర్యాదులు.. ఏలూరులో 7241, పశ్చిమలో 6872 సున్నా డోర్‌ నంబర్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఓటర్ల జాబితా(Voters List)లో ఇంటి నంబర్ల వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. ఓటర్ల జాబితాల్లో సుమారు నాలుగు లక్షల ఇళ్లకు డోర్‌ నంబర్లు(Door numbers) కనిపించకపోవడంతో, వీటి వెనుక ఉన్న మతలబు ఏమిటని రాజకీయ పార్టీలు ఆరా తీయడం మొదలు పెట్టాయి. ఇవి దొంగ ఓట్లా? లేక నిజంగానే ఆ ఇళ్లకు నంబర్లు లేవా? అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు భారీగా ఫిర్యాదులు కూడా పంపుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం నడుస్తోంది. ఈసీ నియమించిన బూత్‌ స్థాయి అధికారులు(Booth level officials) ప్రతి ఇంటికి వెళ్లి, అందరికీ ఓట్లు ఉన్నాయా? ఎవరి ఓట్లైనా పోయాయా? ఎవరైనా ఇళ్లు మారారా? అన్న సమాచారం సేకరించి తదనుగుణంగా జాబితాలను సవరిస్తున్నారు. దీనిని పురస్కరించుకొని అన్ని గుర్తింపు కలిగిన పార్టీలకూ ఓటర్ల జాబితాలను ఈసీ అందజేసింది. ఈ జాబితాలను విశ్లేషిస్తున్న రాజకీయ పార్టీలు(Political parties) వాటిలో కనిపిస్తున్న లోపాలు, అవకతవకలను చూసి దిగ్భ్రాంతి చెందుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి ఓటర్‌ పేరు ఎదురుగా ఆ ప్రాంతం పేరు, నివసిస్తున్న ఇంటి నంబర్‌, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ తదితర వివరాలు ఉండాలి. అయితే, పెద్ద సంఖ్యలో ఇంటి నంబర్లు గల్లంతైన విషయం రాజకీయ పార్టీల విశ్లేషణలో బయటపడింది. ఎక్కువ చోట్ల ఇంటి నెంబర్ల స్థానంలో సున్నా ఉంది. కొన్ని చోట్ల రెండు సున్నాలు పెట్టారు. మరి కొన్ని ఇంటి నంబర్లు సున్నాతో మొదలయ్యాయి. అధికారికంగా పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లకు కేటాయించే నెంబర్లు ఏవీ సున్నాతో మొదలు కావు. ఈ సున్నాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది పార్టీల నేతలకు అంతుపట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకుపైగా ఇళ్లకు సున్నా డోర్‌ నంబరును ఓటర్ల జాబితాలో చూపినట్టు గుర్తించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇవి పది వేలకు పైగా ఉండటం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన రాజకీయ పార్టీలు ఆ వివరాలను క్షేత్రస్థాయిలోని తమ ప్రతినిధులకు పంపి తనిఖీ చేయించే పని మొదలు పెట్టారు. గతంలో ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు ఆ పని నిర్వహించిన అధికారులు ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో కొందరి ఇంటి నంబరు బదులు సున్నా వేశారు. నిజంగా ఆ ఇంటికి నంబర్‌ లేకపోవడం వల్ల సున్నా వేశారా? లేక దొంగ ఓట్లను చేర్చినప్పుడు ఇంటి నంబర్‌ సున్నా వేశారా?

అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్రామాలు, పట్టణాల్లో ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు కట్టుకొన్నప్పుడు వాటికి ఇంటి నంబర్లు ఇవ్వరని, అటువంటి చోట్ల సున్నా వేసి ఉంటారని కొందరు అధికారులు అంటున్నారు. అయితే, అవి ఇంత భారీ సంఖ్యలో ఉంటాయా అన్నది మరి కొందరి అనుమానం. ఈ వివరాలు ఓటర్ల జాబితా నుంచి విడిగా తీసి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తయారు చేసి పార్టీల ప్రతినిధులు ఎన్నికల సంఘానికి పంపుతున్నారు. ఒక ఫిర్యాదు ప్రకారం తిరుపతి నగరంలో 8 వేల ఇళ్లకు నంబర్లను పేర్కొనలేదు. వాటి కింద మొత్తం 34 వేల మంది ఓటర్లు నమోదై ఉన్నారు. అయితే, అవి ఇంత భారీగా ఉండే అవకాశం లేదని, ఓటర్ల జాబితా నుంచి వివరాలు బయటకు తీయడంలో పొరపాటు జరిగి ఉంటుందని ఈసీ వ్యవహారాల(EC affairs)పై అనుభవం ఉన్న ఒక అధికారి చెప్పారు. అయినప్పటికీ వేలు, లక్షల సంఖ్యలో ఇళ్లకు నంబర్లు లేకపోవడం తీవ్రంగానే పరిగణించాల్సి ఉందన్నారు. లిఖితపూర్వకంగా అందిన ప్రతి ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆయా జిల్లాలు, నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు పంపి విచారణ జరపాలని ఆదేశిస్తున్నారు. ఈసారి ఓటర్ల జాబితాల సవరణపై పార్టీలు, ప్రజల్లో వచ్చిన అప్రమత్తత వల్ల ఇటువంటి లోపాలు చాలావరకూ సరి కాగలవని ఆశిస్తున్నామని అధికార వర్గాలు అంటున్నాయి.

పోలవరంలో 2,627 ‘సున్నా’ డోర్‌నంబర్లు..

ఏలూరు జిల్లాలో జీరో డోర్‌ నెంబర్‌తో 7,241 ఇళ్లు ఉన్నాయని తేల్చారు. పోలవరం నియోజకవర్గంలో జీరో డోర్‌ నంబర్‌ ఇళ్లు 2,627 ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 6,872 ఇళ్లకు సున్నా డోర్‌ నంబర్లు చూపించారు.

కాకినాడలో బీఎల్‌వో సస్పెన్షన్‌!

కాకినాడ కార్పొరేషన్‌, జూలై 24: ఓట్ల పరిశీలనలో భాగంగా బీఎల్‌వోలు తమ వెంట వలంటీర్లను తీసుకువెళ్తున్నారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురిమతమైన వార్తకు కాకినాడ నగర కమిషనర్‌ స్పందించి బీఎల్‌వోను సస్పెండ్‌ చేసి వలంటీర్‌ను విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది.

ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలన: కలెక్టర్‌

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో వందేళ్లు దాటిన ఓటర్లు 198 మంది ఉన్నారు. జిల్లా అధికారులతో కలెక్టర్‌ కె.మాధవీలత సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఒకే డోర్‌ నెంబరులో పది మంది కంటే ఎక్కువ ఓటర్లున్న ఇళ్లు 8,489 ఉన్నాయి. వాటిలో 7,439 ఇళ్లను పరిశీలించాం. మిగతా వాటిని రెండు రోజుల్లో పరిశీలిస్తాం’ అని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2023-07-25T03:35:24+05:30 IST