CM JAGAN: మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. చిన్నారుల బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
ABN , First Publish Date - 2023-08-02T18:08:17+05:30 IST
మహిళా, శిశు సంక్షేమశాఖపై (Women and Child Welfare Department) క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమీక్షించారు.
అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖపై (Women and Child Welfare Department) క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమీక్షించారు. గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ - టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఫౌండేషన్ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా గర్భిణీలు, బాలింతలు రేషన్ అందుకున్నారు. పౌష్టికాహారం కోసం ప్రతిఏటా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారుగా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తోందని జగన్ తెలిపారు.
"డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతపై నిరంతరం సమీక్ష చేయాలి. రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా రాష్ట్రంలో తొలగిపోవాలి. ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలి. అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలి. ఏమైనా సమస్యలు ఉంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలి. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల మెదడు బాగా వృద్ధిచెందే వయసు కాబట్టి, వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. సమీక్షలో మాంటిస్సోరి విద్యావిధానంపై సీఎం చర్చించారు. మాంటిస్సోరి విద్యావిధానాన్ని సీఎంతో సంస్థ ప్రతినిధి చర్చించారు. అధికారులు ముందుగా మాంటిస్సోరి స్కూల్స్‌ను పరిశీలించాలి." అని సీఎం జగన్ అన్నారు.