Viveka Case: హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు కీలక సాక్షి?

ABN , First Publish Date - 2023-05-04T16:28:04+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్నను హైదరాబాద్‌కు తరలించారు.

Viveka Case: హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు కీలక సాక్షి?

తిరుపతి: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka Case) కీలక సాక్షి రంగన్నను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేక అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రంగన్నను తరలించడంపై చర్చలు నడుస్తున్నాయి. రంగన్నను హుటాహుటిన తరలించడం వెనక ఆంతర్యం ఏంటి?.. మెరుగైన చికిత్స కోసమా?.. మరింత భద్రత కోసమే అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రంగన్న వైద్య వివరాలను ఇప్పటి వరకు స్విమ్స్ వెల్లడించలేదు.

తిరుపతి నుంచి 108 వాహనంలో కడప వరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. రంగన్నకు అందించిన వైద్య వివరాలపై బులిటిన్‌ను స్విమ్స్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంలోనూ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. వివేకా హత్యలో రంగన్న కీలక సాక్షిగా ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలసి వివేకను హత్య చేశారని 164 స్టేట్‌మెంట్‌‌లో రంగన్న చెప్పారు. ఈ కేసులో ఏ 1 నిందిుతుడు దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తన ప్రాణాలకు హాని ఉందని దస్తగిరి ఇప్పటికే పదేపదే చెప్పారు. ఇప్పటికే అనుమానాస్పద రీతిలో కల్లూరు గంగాధర రెడ్డి మృతి చెందాడు. రంగన్నను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి రంగన్నను వైద్యం పేరుతో చంపేస్తారని తిరుపతిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-04T16:36:45+05:30 IST