Lokesh Padayatra: మూడో రోజు లోకేష్‌ పాదయాత్ర ఇలా...

ABN , First Publish Date - 2023-01-29T09:07:09+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) మూడో రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు శాంతిపురం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.

Lokesh Padayatra: మూడో రోజు లోకేష్‌ పాదయాత్ర ఇలా...

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) మూడో రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు శాంతిపురం నుంచి ప్రారంభమైంది. ఈ ఉదయం 9:45 గంటలకు సండే మార్కెట్ దగ్గర పబ్లిక్‌తో లోకేష్‌ వాకింగ్ ఇంటరాక్షన్‌ చేయనున్నారు. అనంతరం 3 గంటలకు కుతెంగెట్టపల్లె జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు చెల్దిగానిపల్లెలో రైతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రికి చెల్దిగానిపల్లెలో పాదయాత్ర ముగిస్తారు.

కాగా రెండో రోజు శనివారం లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యల్ని వివరించారు. మహిళలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. ఆయా కుల సంఘాలు తమపై ప్రభుత్వ కక్ష సాధింపు గురించి ఆవేదన చెందారు. వారందరినీ ఓదార్చుతూ, ‘నేనున్నాను’ అంటూ లోకేశ్‌ పాదయాత్రను కొనసాగించారు. ‘యువగళం’ యాత్రకు స్థానికులతో పాటు బయటి ప్రాంతాల నుంచీ విపరీతంగా జనాలు హాజరుకావడంతో దారులు జనసంద్రమయ్యాయి.

లోకేశ్‌ మొదటి రోజు బస చేసిన గుడుపల్లె మండలం నలగామపల్లెలోని పీఈఎస్‌ ప్రాంగణం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమైంది. మొత్తం 9.3 కిలోమీటర్లు నడిచి శాంతిపురం సమీపంలో యాత్రకు విరామం ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభంలో పీఈఎస్‌ సమీపంలో నిర్మాణంలో ఆగిపోయిన వాల్మీకీ, కురుబ కమ్యూనిటీ హాళ్లను లోకేశ్‌ పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.10 కోట్లతో ప్రారంభించిన నిర్మాణపనులను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిందని అక్కడి బీసీలు లోకేశ్‌ వద్ద ఆవేదన చెందారు. ఇక్కడి స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేయడంతో పాటు ఈ భవనాలను బెల్టు షాపులుగా మార్చేశారని ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు మీద నేరుగా కోపాన్ని చూపించలేక, ఈ భవన నిర్మాణాల్ని ఆపేసి కక్ష సాధిస్తున్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

Updated Date - 2023-01-29T09:07:12+05:30 IST