Temperature: నిప్పుల కొలిమిలా కోస్తా

ABN , First Publish Date - 2023-04-12T21:20:02+05:30 IST

కోస్తాలో అనేక ప్రాంతాలు బుధవారం నిప్పుల కొలిమిలా మారాయి. పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడం, ఆకాశం నిర్మలంగా ఉండడం

Temperature: నిప్పుల కొలిమిలా కోస్తా

విశాఖపట్నం: కోస్తాలో అనేక ప్రాంతాలు బుధవారం నిప్పుల కొలిమిలా మారాయి. పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడం, ఆకాశం నిర్మలంగా ఉండడం, సముద్రం నుంచి తేమగాలులు లేకపోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. శ్రీకాకుళం (Srikakulam) నుంచి పల్నాడు జిల్లా వరకు మొత్తం 13 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 71 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో ఆరు, కాకినాడలో నాలుగు, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, విజయనగరం జిల్లా (Visakhapatnam Vizianagaram District)ల్లో ఒక్కొక్క మండలంలో తీవ్రగాడ్పులు వీచాయి. ఎండకు కోస్తా ప్రజలు ఠారెత్తిపోయారు. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఈ ఏడాది వేసవి ప్రారంభం తరువాత ఇంత తీవ్రంగా ఎండలు కాయడం ఇదే తొలిసారి.

బుధవారం విజయవాడ అర్బన్‌లో 44.1, గుమ్మలక్ష్మిపురంలో 43.9, పెదకూరపాడులో 43.7, వేపాడ, తుని, కోటవురట్లలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతోపాటు సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో మధ్యభారతం దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh), విదర్భ, కర్ణాటకలలో ఈనెల తొలి వారం వరకు వర్షాలు కురిశాయి. అయితే వారం నుంచి ద్రోణులు బలహీనపడడంతో ఒక్కసారిగా ఆకాశం నిర్మలంగా మారింది. దీనికితోడు బంగాళాఖాతం నుంచి తగినంత తేమగాలులు వీయడం లేదు. దీంతో కోస్తాలో గడచిన మూడు రోజుల నుంచి ఎండలు క్రమేపీ పెరుగుతూ పలుచోట్ల వడగాడ్పులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగాయి. దీంతో రాత్రిళ్లు ఉక్కపోత మరింత ఎక్కువకానుంది. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 39 డిగ్రీల నుంచి గరిష్టంగా 42 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం 23 జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ (Orange Alert) జారీ చేసింది. ఆ జిల్లాల్లో అప్రమత్తత హెచ్చరికలను జారీ చేశారు. గురువారం అన్ని జిల్లాల్లోనూ సగటున 38-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - 2023-04-12T21:20:02+05:30 IST