MLC Elections: మండలి ఎన్నికల్లో వైసీపీ బరితెగింపు.. ఎమ్మెల్సీ బీటెక్‌ రవిపై దాడి

ABN , First Publish Date - 2023-03-13T20:55:38+05:30 IST

శాసనమండలి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Chief Minister YS Jagan) సొంత జిల్లా కడపలో వైసీపీ బరితెగించింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసింది.

MLC Elections: మండలి ఎన్నికల్లో వైసీపీ బరితెగింపు.. ఎమ్మెల్సీ బీటెక్‌ రవిపై దాడి

కడప: శాసనమండలి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (Chief Minister YS Jagan) సొంత జిల్లా కడపలో వైసీపీ బరితెగించింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసింది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు, పోలింగ్‌ కేంద్రాల వద్దనే ఓటుకు నోటు అందించింది. జిల్లా వ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)లోని లింగాల పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ నేతలు (YCP leaders) ఓటర్లను మభ్యపెట్టడం, రిగ్గింగ్‌కు పాల్పడే యత్నం చేస్తుండడంతో స్థానిక టీడీపీ నేత విశ్వనాధరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయనపై దాడి చేసి చొక్కాచించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడే మాటువేసిన వైసీపీ మూకలు బీటెక్‌ రవి (BTech Ravi)పై బండరాళ్లతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అలర్ట్‌ అయి బీటెక్‌ రవిని పక్కకు తీసుకెళ్లారు. అయితే ఈ దాడిలో పోలీసు వాహనాల అద్దాలు, బీటెక్‌ రవి కారు అద్దాలు పగిలిపోయాయి. బీటెక్‌ రవిని పోలీసులు పులివెందులకు తీసుకెళ్లారు.

కడప నగరం (Kadapa city)లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం జిల్లా పరిషత్‌లో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న ఎంవీ రామచంద్రారెడ్డి అనుచరులు పోలింగ్‌ కేంద్రం బయటనే ఓటింగ్‌కు రాని వారిని గుర్తించి వారికి ఫోన్‌పే ద్వారా నగదు పంపిణీ చేసి స్లిప్పులు అందించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్ల ద్వారా మధ్యాహ్నం తరువాత ఇంకా ఎవరు ఓటింగ్‌కు రాలేదో వారి జాబితా తెలుసుకుని వారిని పోలింగ్‌ కేంద్రాలకు రప్పించారు. వారికి ఫోన్‌పే ద్వారా రూ.5వేలు వంతున అందజేసినట్లు సమాచారం. ఓటింగ్‌కు రాని వారి స్లిప్పులన్నీ ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన నాగసుబ్బారెడ్డి దగ్గర కవరులో ఉండడంతో వాటి కోసం లెఫ్ట్‌ పార్టీ నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. గాంధీనగర్‌లోని గ్రాడ్యుయేట్‌ పోలింగ్‌ కేంద్రంలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. సత్యనారాయణ అనే గ్రాడ్యుయేట్‌ ఓటును గుర్తు తెలియని వ్యక్తులు వేశారు. వలంటీర్లు, డ్వాక్రా మహిళలు, ఆర్పీలు అక్కడ తిష్ట వేసి ఓటుకు నగదు పంపిణీ చేయడంతో పాటు దొంగ ఓట్లు వేయడం చర్చనీయాంశమైంది. జిల్లాలో గ్రాడ్యుయేట్‌ ఓట్ల పోలింగ్‌ 60.888 శాతం నమోదైంది. ఉపాధ్యాయ ఓట్లు 85.24 శాతంగా నమోదైంది.

Updated Date - 2023-03-13T20:55:38+05:30 IST