Volunteer : చిక్కుల్లో ‘వలంటీర్‌!’

ABN , First Publish Date - 2023-07-27T02:24:22+05:30 IST

జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌పై ‘ప్రాసిక్యూషన్‌’ వలంటీర్ల వ్యవస్థకే చిక్కులు తెస్తుందా? వలంటీర్ల వ్యవస్థపై ఇప్పటిదాకా లేవనెత్తని, ప్రభుత్వం సమాధానం చెప్పలేని కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తాయా?

Volunteer : చిక్కుల్లో ‘వలంటీర్‌!’

బూమరాంగ్‌ అవుతున్న సర్కారు చర్య

పవన్‌ ‘ప్రాసిక్యూషన్‌’తో కొత్త చర్చ

కోర్టులో అనేక ప్రశ్నలకు ఆస్కారం

‘వలంటీర్ల’కు నాలుగేళ్ల తర్వాత చట్టబద్ధత

కాంట్రాక్టా? ఔట్‌సోర్సింగా? టైమ్‌స్కేలా?

ఏ కేటగిరీ కిందకు వస్తారో తెలియదు

వేతనం చెల్లింపు చెల్లుబాటవుతుందా?

సొంత కార్యకర్తలని తేల్చిన వైసీపీ నేతలు

పార్టీ సమావేశాలకూ వలంటీర్ల హాజరు

రాజకీయ అవసరాలే లక్ష్యంగా పుట్టిన వ్యవస్థ

కోర్టులో ఇవన్నీ చర్చకు వచ్చే ఆస్కారం

పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)పై కేసు వేసిన ఓ మహిళా వలంటీర్‌ను... ‘మీకు ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రమేది?’ అని తాజాగా విజయవాడ కోర్టు(Vijayawada Court) ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవస్థపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఫ వలంటీర్లు అంటే.. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందించేవారని అర్థం. ప్రభుత్వం ‘వలంటీర్లు’ అని పేరు పెట్టి వారికి వేతనం అందించడం చట్ట విరుద్ధమే అవుతుంది. మొత్తం 2.50 లక్షల మందికి గత నాలుగేళ్లలో వేతనాలు, ప్రోత్సాహకాల రూపంలో 6 వేల కోట్లు చెల్లించారు.

వలంటీర్ల వ్యవస్థ(volunteers system)కు చట్టబద్ధత లేదని, వారు అధికార పార్టీ పక్షాన పని చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌ కూడా భావిస్తోంది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది.

ప్రభుత్వ సర్వీసుల్లో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, టైమ్‌స్కేల్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు.. వంటి కేటగిరీల వారు ఉంటారు. వలంటీర్‌ వ్యవస్థ ఈ కేటగిరీల్లో దేనికీ సంబంధించినది కాదు.

ఏ విధానంలో వలంటీర్ల నియామకం చేపట్టారు? అసలు ఈ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వలంటీర్లకు గౌరవవేతనం ఇవ్వొచ్చా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి):

జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌పై ‘ప్రాసిక్యూషన్‌’ వలంటీర్ల వ్యవస్థకే చిక్కులు తెస్తుందా?

వలంటీర్ల వ్యవస్థపై ఇప్పటిదాకా లేవనెత్తని, ప్రభుత్వం సమాధానం చెప్పలేని కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తాయా?

అత్యుత్సాహంతో పవన్‌ కల్యాణ్‌పై పెడుతున్న కేసులతో జగన్‌ సర్కారుకు ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదముందా?

విశ్లేషకులు, న్యాయ నిపుణులు ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే... వలంటీర్ల ద్వారా సేవలు అందించడం ఎలా ఉన్నా, ఇది అచ్చంగా జగన్‌ ఏర్పాటు చేసుకున్న ‘సొంత సైన్యం’ అనే బలమైన ఆరోపణలున్నాయి. వీరి పనితీరుపై గతంలో ఒకటి రెండు సందర్భాల్లో హైకోర్టు కూడా ప్రశ్నించింది. అయితే... ఇప్పటిదాకా వలంటీర్ల వ్యవస్థపై ఎవరూ కోర్టుల్లో కేసులు వేయలేదు. కానీ... ఇప్పుడు ప్రభుత్వమే వలంటీర్ల వ్యవస్థపై కోర్టుల్లో చర్చ జరిగే నిర్ణయం తీసుకుంది. అదే... పవన్‌ కల్యాణ్‌ను ప్రాసిక్యూట్‌ చేయడం! ఇటీవల పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయయాత్ర(Varahi Vijayatra)లో వలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. డేటా సేకరణపై పలు ప్రశ్నలు సంధించారు. దీంతో ప్రభుత్వం వలంటీర్లను వెనకేసుకొస్తూ ఏకంగా పవన్‌పై కేసు పెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వలంటీర్‌ వ్యవస్థ చర్చనీయాంశమైంది.

పద్ధతిగా ఏర్పాటు చేశారా?

జగన్‌ అధికారంలోకి రాగానే. అప్పటికప్పుడు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎలాంటి పద్ధతీ పాటించకుండా పుట్టిన వ్యవస్థ ఇది. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే ప్రతిపైసా చట్టబద్ధంగా జరగాలి. ప్రభుత్వంలో నియమించే ఉద్యోగులకు కచ్చితంగా చట్టబద్ధత ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు నాలుగేళ్ల తర్వాత ఈ సర్కార్‌ చట్టబద్ధత కల్పించింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులను... రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, టైమ్‌స్కేల్‌, పార్ట్‌టైమ్‌ అనే కేటగిరీల్లో నియమిస్తారు. వలంటీర్లు ఇందులో ఏ కేటగిరీలోకీ రారు. అయినా సరే... వారికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెలా రూ.5వేలు చెల్లిస్తున్నారు. ఇది ఎలా చెల్లుబాటవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.


సొంత కార్యకర్తలే..

జగన్‌ సర్కారు గ్రామాల్లో 1.90 లక్షల మందిని... పట్టణాల్లో 60వేల మందిని... మొత్తం 2.50 లక్షల మందిని వలంటీర్లుగా ఎంపిక చేసింది. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో 80 కుటుంబాలకు ఒకరిని చొప్పున నియమించారు. వీరి నియామకం ఏమాత్రం పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగలేదు. దాదాపు 9.26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 6.64 లక్షల మంది మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మండల స్థాయిలో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలు నామమాత్రంగా జరిగాయి. గ్రామాలు, పట్టణాల్లో వైసీపీ నేతలు సిఫారసు చేసిన అధికార పార్టీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారు. రిజర్వేషన్‌ నిబంధనలను అమలు చేయలేదు. తమ పార్టీ కార్యకర్తలు అందుబాటులో లేనిచోట.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తేనే వలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని నిబంధనలు పెట్టారు. వలంటీర్లంతా మనవాళ్లే... అని వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. 90 శాతంమంది వలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని మరో నాయకుడు చెప్పారు. అధికార పార్టీ నాయకులు వలంటీర్లను తమ సొంత కార్యకర్తల్లాగానే వాడుకుంటున్నారు. పార్టీ సమావేశాలకూ బలవంతంగా రప్పిస్తున్నారు. వలంటీర్లకు ఇష్టమున్నా, లేకున్నా స్థానిక వైసీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోక తప్పడంలేదు. పవన్‌ కల్యాణ్‌ను ప్రాసిక్యూషన్‌ ప్రక్రియలో భాగంగా... న్యాయస్థానంలో ఈ విషయాలన్నీ ప్రస్తావనకు రాకమానవని ఒక న్యాయ నిపుణుడు తెలిపారు.

ఈ మాత్రం విధులకేనా?

వలంటీర్ల వల్ల ప్రజలకు కొత్తగా జరిగిన ప్రయోజనమేమిటనే ప్రశ్న కూడా ఉంది. అంతకుముందు కూడా లబ్ధిదారులకు నెలనెలా ఠంచనుగా పెన్షన్లు అందాయి. పథకాలూ లభించాయి. లబ్ధిదారుల గుర్తింపు కూడా జరిగింది. ఇప్పుడు అవే పనులను వలంటీర్లతో చేయిస్తున్నారు. పైగా... పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను కూడా ఏర్పాటు చేశారు. వెరసి... ప్రతి నెలా ఒకటో తేదీన సామాజిక పెన్షన్‌ను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వడమే వలంటీర్లు నికరంగా చేసే పని. ఇక... ప్రభుత్వ రాజకీయ అవసరాలు, ఎన్నికల వ్యూహాల కోసం ఎప్పటికప్పుడు వివిధ పేర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు.

నాడు జన్మభూమి కమిటీలపై రచ్చ

టీడీపీ ప్రభుత్వం హయాంలో నామమాత్రంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలపై అప్పటి ప్రతిపక్షనేత జగన్‌, ఆయన రాజకీయ వ్యూహకర్తలు చేసిన దుష్ప్రచారం అంతా, ఇంతా కాదు. వాస్తవానికి ఆ వ్యవస్థ టీడీపీకి అంతగా ఉపయోగపడలేదు. అయినా వైసీపీ చేసిన దుష్ప్రచారంతో గత ఎన్నికల్లో టీడీపీ భారీగా నష్టపోయింది. అయితే వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రజల అవసరాల కంటే సొంత అవసరాలకే ఎక్కువగా వాడుకుంటోంది.

Updated Date - 2023-07-27T04:38:13+05:30 IST