Varla Ramaiah: పోలీసుల వ్యవహారశైలి చాలా పక్షపాతంగా ఉంది
ABN , First Publish Date - 2023-08-11T18:57:54+05:30 IST
ఏపీ పోలీసుల (AP police) తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఏపీ పోలీసుల (AP police) తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలి చాలా పక్షపాతంగా ఉంది. ముద్దాయిలు టీడీపీ వారైతే పోలీసులు వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు చేస్తున్న టేబుల్ ఇన్వెస్ట్ గేషన్ మానాలి. టీడీపీ నాయకులకు బెయిల్ రాకూడదు, రిమాండుకు వెళ్లి తీరాలనే దృష్టితో పోలీసులు ప్రతిదానికి హత్యాయత్నం (307 ఐపీసీ) కేసులు నమోదు చేస్తున్నారు. పుంగనూరు ఘటనను సాకుగా తీసుకుని టీడీపీ నాయకులను వేధించడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారు. వెంకటగిరిలో టీడీపీ నాయకులు కేవలం దిష్టిబొమ్మ తగులబెడితే.. దానికి పోలీసులు హత్యాయత్నం కింద కేసు రిజిష్టర్ చేస్తారా?. ఒంటిమీద పెట్రోల్ పడ్డట్టు ఆధారాలు లేకపోయినా పెట్రోల్ పోసి నిప్పంటించబోయారని తప్పుడు కేసు పడ్తారా?. కత్తితో పొడిచినట్లు చిన్న గాయమైనా లేనప్పుడు, కత్తి కనపడనప్పుడు అది హత్యాయత్నం ఎలా అవుతుంది?. 307 జేపీసీ(జగన్ పీనల్ కోడ్) నాన్ బెయిలబుల్ హత్యాయత్నం కేసు పెట్టి అసలు 307 ఐపీసీ పక్కన పెట్టి టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. " అని వర్ల రామయ్య మండిపడ్డారు.
అనంతపురం ఎస్ఇబి పోలీసు స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ను వైసీపీ నాయకులు చున్నీ లాగి అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. పోలీస్ అసోసియేషన్ ఏంచేస్తోంది. వైసీపీ కార్యకర్తలు చూపించిన ఇళ్లల్లో రైడ్ చేసి ఆడ, మగ తేడా లేకుండా, టీడీపీ వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులుండవు. వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో రిజిష్టర్ చేసిన క్రైమ్ నెంబర్ 153/2023 కేసును వెంటనే రద్దు చేయాలి. పుంగనూరు ఘటనను చూపించి టీడీపీ కార్యకర్తలను సాధించాలనుకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది." అని వర్ల రామయ్య ప్రశ్నించారు.