CM Jagan: ఒక్కో రైతుపై రూ. 2.45 లక్షల అప్పు.. దేశంలో ఏపీ టాప్

ABN , First Publish Date - 2023-03-21T16:38:59+05:30 IST

దేశంలో రైతులపై అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి రైతుపై సగటున రూ.2,45,554.00 అప్పు ఉన్నట్లు కేంద్రమంత్రి

CM Jagan: ఒక్కో రైతుపై రూ. 2.45 లక్షల అప్పు.. దేశంలో ఏపీ టాప్

ఢిల్లీ: దేశంలో రైతులపై అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి రైతుపై సగటున రూ.2,45,554.00 అప్పు ఉన్నట్లు కేంద్రమంత్రి భగవత్ (Union Minister Bhagwat) రాజ్యసభలో వెల్లడించారు. దేశంలో వ్యవసాయం, రైతాంగ పరిస్థితులు, అప్పులపై రాజ్యసభ (Rajya Sabha)లో ఎంపీల ప్రశ్నకు కేంద్రమంత్రి చెప్పిన సమాధానం ఇది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది మూడింతలు అధికం. అలాగే ప్రతి రైతుపై అప్పు విషయంలో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ (Telangana) నిలిచింది. తెలంగాణలో సగటున ప్రతి రైతుపై రూ.1,52,113 అప్పు ఉన్నట్లు కేంద్రమంత్రి భగవత్ తెలిపారు. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల సగటు ఆధాయం 10, 218 రూపాయలతో పోల్చితే.. ఏపీ రైతు కుటుంబాల ఆదాయం రూ. 10,403గా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం 2.56 ఆదాయం ఉన్నప్పటికీ ఆప్పు మాత్రం దాదాపు మూడురెట్లు అధికంగా ఉందని అంటున్నారు.

పావలా వడ్డీ రుణాలకు మంగళం

రాష్ట్రంలో అత్యధిక మంది ఆధారపడేది వ్యవసాయంపైనే. సాగు చేయాలంటే పెట్టుబడి కావాలి. గతంలో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలు అందించేవారు. దీనివల్ల రైతన్నలకు వడ్డీల భారం తగ్గేది. జగన్‌ (Jagan) సర్కారు పావలా వడ్డీ రుణాలకు మంగళం పాడేసింది. వడ్డీతో సహా రుణం చెల్లిస్తేనే సున్నా వడ్డీ రాయితీ అని మెలిక పెట్టింది. దీంతో రైతుల (Farmers)పై వడ్డీల భారం పడుతోంది. ఇక 90 శాతం మంది కౌలురైతులకు రుణాలు అందించడం లేదు. ఈ లెక్కన వైసీపీ (YCP) ప్రభుత్వం వల్ల అన్నదాతలకు కొత్తగా ఒనగూరుతున్నదేమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా చాలా తక్కువ మందికి అందుతోంది. గత ప్రభుత్వంలో రాయితీపై సూక్ష్మపోషకాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, ఇలా అనేక రకాలుగా రైతాంగానికి లబ్ధి ఉండేది. ఇప్పుడు రాయితీ పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారు. కొన్ని పథకాలు ఉన్నాయో లేవో రైతులకే తెలియని పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల రైతులకు మేలు జరగడం లేదు. వ్యవసాయానికి తగినంత ఊతం అందడం లేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం, పరిహారం అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకొంటోంది. పెట్టుబడులు పెరగడం, అధిక వడ్డీలకు అప్పులు చేయడం, ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

రైతులపై వడ్డీ భారం

గత ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలను అమలు చేసింది. వడ్డీ భారం తగ్గడంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేది. జగన్‌ సర్కార్‌ వచ్చాక పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. లక్షలోపు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ అమలు చేస్తోంది. రూ.లక్షపైన తీసుకునే రుణాలకు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. నాలుగేళ్లలో జగన్‌ సర్కార్‌ సున్నా వడ్డీ కింద ఇచ్చిన వడ్డీ రాయితీ రూ.487.4 కోట్లు మాత్రమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2023-03-21T16:51:10+05:30 IST