Paritala Sunitha: టీచర్ మల్లేష్‌కు పరిటాల సునీత ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2023-12-11T12:47:45+05:30 IST
Andhrapradesh: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్‌కు మాజీ మంత్రి పరిటాల సునీత ఆర్థిక సాయం అందజేశారు. సోమవారం ఉదయం మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథ్ రెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి టీచర్ మల్లేష్‌ను పరామర్శించారు.
అనంతపురం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్‌కు (Teacher Mallesh) మాజీ మంత్రి పరిటాల సునీత ఆర్థిక సాయం అందజేశారు. సోమవారం ఉదయం మాజీ మంత్రులు పరిటాల సునీత (Paritala Sunitha), పల్లెరఘునాథ్ రెడ్డి (Palle Raghunath Reddy) ప్రభుత్వాస్పత్రికి వెళ్లి టీచర్ మల్లేష్‌ను పరామర్శించారు. ఉపాధ్యాయుడు మల్లేష్ కుటుంబ సభ్యులకు సునీత ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మల్లేష్‌కు పరిటాల సునీత రూ.50వేుల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు భయపడి ఎన్నికల విధులకు కూడా దూరం చేస్తున్నారన్నారు. చదువు చెప్పే ఉపాధ్యాయులతో చేయరాని పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పతనానికి ఇక ఎన్నో రోజులు లేవని హెచ్చరించారు.
ప్రజలకు సేవ చేసే ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకొచ్చారన్నారు. ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నంపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోన్‌యాప్స్ వల్లే మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వైసీపీ సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడానికి రాప్తాడు ఎమ్మెల్యే టీమ్‌లనే పెట్టుకున్నారన్నారు. దుష్ప్రచారాలు చేయడానికి సోషల్ మీడియా టీంలకు హైదరాబాదులో ట్రైనింగ్ ఇప్పించారన్నారు. ‘‘మల్లేష్ ఆత్మహత్యకు సరైన కారణాలు తెలుసుకోని మాట్లాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నువ్వు లోన్స్ తీసుకున్నావ్ కదా ప్రకాష్ రెడ్డి.. నువ్వేమైనా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించావా..? మీరు, మీ వైసీపీ నాయకులు దోచుకున్న సొమ్ముతో సంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పింఛనర్లు అప్పుల పాలవుతున్నారు. మల్లేష్‌కు ఏమైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు’’ అంటూ పరిటాల సునీత ప్రశ్నించారు.