Share News

Teacher: నా మరణానికి జగనే కారణం.. చావు బతుకుల్లో టీచర్..

ABN , First Publish Date - 2023-12-11T09:02:38+05:30 IST

అనంతపురం: నిన్న (ఆదివారం) ఆత్మహత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు మల్లేష్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఉరవకొండ మండలం, చిన్న ముష్టురు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లేష్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Teacher: నా మరణానికి జగనే కారణం.. చావు బతుకుల్లో టీచర్..

అనంతపురం: నిన్న (ఆదివారం) ఆత్మహత్యాయత్నం చేసిన ఉపాధ్యాయుడు మల్లేష్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఉరవకొండ మండలం, చిన్న ముష్టురు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లేష్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీపీఎస్ రద్దు పేరిట మోసం చేస్తూ టీచర్లకు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ కంటే చంద్రబాబే బెటర్... ఆయనను కాదనుకొని పెద్ద తప్పు చేశామంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పులకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామంటూ ఐదు పేజీల లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే విద్యాశాఖ అధికారులు స్పందించలేదు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్‌ను పరామర్శించడానికి కూడా రాలేదు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడకూడదంటూ మల్లేష్ కుటుంబ సభ్యులపై అధికారులు తీవ్రఒత్తిడి చేస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్ మల్లేష్‌ను మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల శ్రీనివాసులు తదితరులు పరామర్శించారు.

పూర్తి వివరాలు...

సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయకపోవడం, ప్రతినెలా జీతాలు ఆలస్యమవుతుండడంతో మనస్తాపం చెంది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మల్లేశ్‌.. తన చావుకు ముఖ్యమంత్రి జగనే కారణం అని లేఖ రాసి, ఆదివారం పురుగుల మందు తాగారు. జగన్‌ మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనమైందని ఐదు పేజీల లేఖలో పేర్కొన్నారు. మల్లేశ్‌ అనంత జిల్లాలోని విడపనకల్లు మండలం పాల్తూరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. ఆదివారం సెలవు కావడంతో పాఠశాలకు వెళ్లలేదు. తాను చనిపోతున్నాననీ, అందుకు కారణాలతో ఐదు పేజీల లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తన చావుకు కారణం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనీ, సీపీఎస్‌ రద్దు.. ఓపీఎస్‌ అమలు, ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలన్నవి తన చివరి కోరికలు అంటూ వాట్సాప్‌ స్టేట్‌సలో పెట్టుకున్నారు. దీంతో తోటి ఉపాధ్యాయులు అప్రమత్తమై ఉరవకొండ పోలీసులకు సమాచారం అందించారు. మల్లేశ్‌ ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా ఆయన ఉరవకొండ మండలం పెన్నహోబిలం వద్ద ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. అప్పటికే మల్లేశ్‌ పురుగుల మందు తాగి, అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆయనను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురం తీసుకెళ్లారు.

ఇదీ లేఖ సారాంశం!

‘జగన్‌ ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేస్తానని, ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏలు సకాలంలో ఇస్తామని హామీ ఇవ్వడంతో నమ్మా. 2019 ఎన్నికల్లో మా కుటుంబంలోని ఓట్లన్నీ వైసీపీకే వేశాం. కానీ ఇప్పుడు బాధపడుతున్నా. కనీసం జీతాలు కూడా సరిగా వేయకుండా వేధిస్తున్నాడు. ఒక నెల, రెండు నెలలు ఆలస్యమైతే తట్టుకోవచ్చు. ప్రతినెలా ఆలస్యమవుతుండడంతో ఈఎంఐలు, చిట్టీల వాయిదాలు కట్టుకోలేకపోతున్నా. ఇల్లు కట్టుకోవడం నా చిరకాల కోరిక. దానిని కూడా కట్టుకోలేకపోతున్నా. పీఆర్సీ విషయంలో జగన్‌ చాలా మోసం చేశారు. ఐఆర్‌ 27శాతం ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ పీఆర్సీ రూపంలో వెనక్కి లాగేసుకున్నారు. ఇది జగన్‌ చేసిన అతి పెద్ద ద్రోహం. చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. జగన్‌ అంతకుమించి ఇస్తారనుకుంటే 23 శాతం ఇచ్చారు. రెండు డీఏలు పెట్టినందుకే చంద్రబాబును కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాం. ఆయనను కాదనుకున్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జగన్‌ కంటే చంద్రబాబే బెటర్‌ అని జగనే నిరూపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రతినెలా ఒకటో తేదీన కచ్చితంగా జీతాలు వేసేశారు. వైసీపీ పాలనలో ఎందుకు వేయలేకపోతున్నారు? మా జీవితాలను నాశనం చేయొద్దు. దసరా సెలవుల్లోనే చనిపోదామనుకుని లెటర్‌ రాసి పెట్టుకున్నా. నేను చనిపోయిన తర్వాతైనా నాకు రావాల్సిన బెనిఫిట్స్‌ నా కుటుంబానికి త్వరగా వచ్చేలా ముఖ్యమంత్రి చూడాలి. ఉద్యోగులారా ఐఆర్‌కు ఆశ పడి ఓటేశారా.. ఇక అంతే. మళ్లీ అధికారంలోకి వస్తే.. సీఎంకు అవగాహన లేక ఐఆర్‌ ఇచ్చారనీ, ఇప్పుడు ఇవ్వడం కుదరదని వెనక్కి లాగేసుకుంటారు. బాగా ఆలోచించి ఓటు వేయండి. నాలాగా ఏ ఉద్యోగీ చనిపోకుండా చూడండి’.

Updated Date - 2023-12-11T09:02:39+05:30 IST