CM KCR : అధికార పార్టీకి సవాల్‌గా హామీలు!

ABN , First Publish Date - 2022-11-20T03:20:45+05:30 IST

సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార టీఆర్‌ఎ్‌సకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాలుగా మారనున్నాయా? ఎన్నికలకు వెళ్లేందుకు ముందే హామీలను అమలు..

CM KCR : అధికార పార్టీకి సవాల్‌గా హామీలు!

ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సమాయత్తం..

హామీలు అమలు చేయాల్సిన అనివార్యత

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో బహిర్గతం

యువతపై ప్రభావం చూపనున్న నిరుద్యోగ భృతి

ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ!

ఇంకా పూర్తిగా అమలుకాని రైతు రుణమాఫీ

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ఎప్పుడు జరిగేను!

ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఎప్పటికందేను!

దళిత బంధు రెండో విడతకు సన్నాహాలు

పైలట్‌ ప్రాజెక్టుగా ‘గిరిజన బంధు’ అమలు!

పోడు హక్కు పత్రాలు వచ్చేనెలలో పంపిణీ

వాగ్దానాల అమలుకు నిధుల సర్దుబాటు

రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలే!

ఎన్నికలకు వ్యవధి ఏడాదే.. అన్నీ చక్కబడేనా?

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అధికార టీఆర్‌ఎ్‌సకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సవాలుగా మారనున్నాయా? ఎన్నికలకు వెళ్లేందుకు ముందే హామీలను అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడిందా? వీటికి నిధులు సర్దుబాటు చేయడం, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌కు పెను సవాలే కానుందా? అంటే ఔననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఇటీవల హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినా.. అక్కడి రాజకీయ వాతావరణం చూశాక హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాత హామీలను అమలు చేస్తామని చెప్పడంతోపాటు అనేక కొత్త హామీలు కూడా అధికార పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. వీటిని తప్పక అమలు చేస్తామని పదే పదే విశ్వసనీయంగా చెప్పాల్సివచ్చింది. దీనికి అనేక అంశాలు తోడవడంతో మొత్తంగా కారు వేగం కాస్తంత పెరిగి గెలుపు గీత దాటేసింది. కానీ, ఈ పరిణామాలను విశ్లేషిస్తే.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అనివార్యత స్పష్టమవుతోంది. గతంలో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా.. చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి, సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించడం, రూ.లక్ష వరకు రుణమాఫీ చేయడం వంటివి ఉన్నాయి. దీనికితోడు నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించడం, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడం వంటివి చేపట్టాల్సి ఉంది. మరోవైపు కీలకమైన ఉద్యోగాల భర్తీ అంశం ఉండనే ఉంది.

పోడు భూములు సాగు చేసుకునే రైతులకు హక్కు పత్రాలు అందించే హామీ కూడా గత ఎన్నికల సమయంలో ఇచ్చినదే అయినందున దానిని కూడా నెరవేర్చాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం కొంత కసరత్తు పూర్తి చేసింది. డిసెంబరులో హక్కు పత్రాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అదే సమయంలో దళితబంధు రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ 500 మందికి లబ్ధి చేకూర్చనున్నట్లు చెప్పింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రెండో విడతలో ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి ఈ పథకం కింద ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. కాగా, పాత హామీలకు తోడు మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఇచ్చిన గిరిజన బంధు హామీ కూడా ఉంది. ఈ పథకాన్ని కూడా త్వరలోనే పైలట్‌గా చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల్లో మునుగోడు తరహా ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో ఈ హామీలను కూడా పట్టాలెక్కిస్తారా.. అనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయమే ఉందని, ఈ కాలమే కీలకమైనదని పార్టీ నేతలకు అధినేత ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పార్టీని పైనుంచి కిందివరకు క్రియాశీలం చేయడం దగ్గర్నుంచి.. మునుగోడులో వేసినట్లుగా ప్రతి అసెంబ్లీ స్థానంలోనూ 100 ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిని నియమించాలని నిర్దేశించారు. అయితే ఇదే క్రమంలో హామీల అమలుపైనా దృష్టి పెట్టి ప్రభుత్వపరంగా కూడా సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంతకాలం అమలు చేయకుండా మిగిలిపోయిన హామీలపై ఇకనైనా దృష్టి పెట్టక తప్పని అనివార్యత ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నిరుద్యోగ భృతి హామీ పట్టాలెక్కేనా!

మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో.. యువత, పట్టణ జనాభా అధికంగా ఉన్న చోట్ల టీఆర్‌ఎస్‌ ఆధిక్యానికి గండి పడినట్లు తేలింది. ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్న యువతలో మార్పు వచ్చిందనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు గతంలోనే చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉందంటున్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,116 భృతిగా ఇస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. కానీ, దీనిపై ఇంతవరకూ కదలిక లేదు. ఎలాంటి ప్రాతిపదికన నిరుద్యోగ భృతి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న అంశంపై అప్పుడప్పుడూ ఆలోచన జరుగుతున్నా.. అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. కొన్ని లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. వారందరికీ ఈ పథకం ఉపకరిస్తుంది. మరోవైపు యువతకు సంబంధించి మరో కీలక అంశమైన ఉద్యోగాల నియామక ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందా అన్నదీ సందేహంగానే మారింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండడం, ఇప్పటికీ నోటిఫికేషన్లు తక్కువ పోస్టులకే వెలువడటంతో ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇందులో 11,103 పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం ద్వారా భర్తీ చేస్తామని, మిగతా 80,039 పోస్టులను వివిధ రికూ్ట్రట్‌మెంట్‌ బోర్డుల ద్వారా ప్రత్యక్ష ఎంపిక విధానం(డైరెక్ట్‌ రికూ్ట్రట్‌మెంట్‌) ద్వారా భర్తీ చేస్తామని అన్నారు. వీటిలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటివరకు 52,594 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇంకా 27,445 పోస్టులకు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే... అనుమతించిన 52,594 పోస్టుల్లోనూ ఇప్పటివరకు 22,594 పోస్టులకే వివిధ బోర్డులు నోటిఫికేషన్లు జారీ చేశాయి. మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్లు విడుదలై, నియామకాలన్నీ వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పూర్తవుతాయా అంటే.. వేచి చూడాల్సిందే.

ఇళ్లకు రూ.3 లక్షలు, రుణమాఫీ సవాళ్లే..

గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన అత్యంత ఆకర్షణీయమైన హామీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం. పేదలు, ఇళ్లు లేనివారికి సౌకర్యవంతమైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. కానీ, దీనిని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోవడం అసాధ్యంగా మారింది. ఈ ఇళ్ల కోసం లక్షల మంది దరఖాస్తులుదారులుండగా.. ఇళ్లు మాత్రం ఆ స్థాయిలో నిర్మించలేదు. నిర్మించిన వాటిలోనూ కొన్ని పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పైగా పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు అందించలేదు. డబుల్‌ బెడ్‌రూం హామీ అమలు చేయడమనే అంశం నుంచి ప్రభుత్వం దాదాపుగా వైదొలిగింది. దానికి బదులుగా సొంతంగా ఇంటి జాగా ఉన్నవారికి.. ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, అది కూడా ఆచరణలోకి రాలేదు. ఇంకోవైపు రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న హామీ కూడా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కొంత ముందుకు కదిలింది. తొలుత రూ.25 వేల వరకు రుణాలను, ఆ తర్వాత రూ.50 వేల వరకు, మూడో విడతలో రూ.75 వేలు, చివరి విడతలో లక్ష రూపాయల్లోపు రుణాలను మాఫీ చేసేలా కార్యాచరణ ప్రకటించింది. తొలి విడతలో రూ.25 వేలలోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసింది. రెండో విడతలోనూ సగం మందికి పూర్తయింది. ఈ కేటగిరీలో రూ.50 వేల మాఫీ పూర్తి కోసం ఇంకా రూ.857 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. రూ.లక్ష దాకా రుణాలను మొత్తం మాఫీ చేసేందుకు రూ.20,587 కోట్ల నిధుల అవసరం ఉంది. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా విడుదల మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో ఈ హామీ పూర్తిస్థాయిలో అమలుచేయడం సవాల్‌గానే మారింది. వీటికితోడు గతం నుంచి కొనసాగుతున్న పథకాలకూ నిధుల కేటాయింపు తప్పనిసరి. దీంతో ఖజానాపై ఆర్థికభారం పడే ఈ హామీలను అమలు చేయడం, చెప్పినవన్నీ నెరవేర్చామన్న పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Updated Date - 2022-11-20T03:46:06+05:30 IST