Attack On Dharmapuri Arvind House: టీఆర్ఎస్ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు

ABN , First Publish Date - 2022-11-18T22:08:45+05:30 IST

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

Attack On Dharmapuri Arvind House: టీఆర్ఎస్ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు
Attack On MP Arvind House

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind Dharmapuri) నివాసంపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. టీఆర్ఎస్ నేతలు రాజా‌రామ్ యాదవ్, మన్నే గోవర్దన్ రెడ్డి, టీఆర్ఎస్‌వీ నేత స్వామి తదితరులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

అంతకు ముందు దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టిఆర్ఎస్ జండాలతో కర్రలతో రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పారు. బెంజ్ కార్ అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 50 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఎంపీ అర్వింద్ నివాసంపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా తెలంగాణలో పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - 2022-11-18T22:10:00+05:30 IST