Munugode By Election: కేసీఆర్‌ కాన్వాయ్‌లో మునుగోడుకు డబ్బు సంచులు: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-10-30T19:27:47+05:30 IST

లిక్కర్‌ స్కామ్‌ వెలుగులోకి రాగానే ఆ భయంతో సీబీఐ తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సీఎం కేసీఆర్‌ (CM KCR) జీవో 51ని విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు.

Munugode By Election: కేసీఆర్‌ కాన్వాయ్‌లో మునుగోడుకు డబ్బు సంచులు: బండి సంజయ్‌
Bandi Sanjay

నల్లగొండ: లిక్కర్‌ స్కామ్‌ వెలుగులోకి రాగానే ఆ భయంతో సీబీఐ తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సీఎం కేసీఆర్‌ (CM KCR) జీవో 51ని విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆరోపించారు. రెండు నెలల క్రితమే జీవో వచ్చినా ఇంతవరకు దానిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదన్నారు. కేసీఆర్‌ కుమార్తె కవిత (Kavitha)పై లిక్కర్‌ స్కామ్‌ బయటికి వచ్చి విచారణ జరుగుతున్న సమయంలో ఈ జీవో తీసుకొచ్చాడని, సీబీఐ (CBI) అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. చండూరులో సీఎం పాల్గొనే బహిరంగ సభ సందర్భంగా ఆయన కాన్వాయ్‌లో మునుగోడుకు డబ్బు సంచులు వచ్చాయని, ఒక్కో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు సిద్ధం చేసిన డబ్బును తీసుకొచ్చారని ఆరోపించారు. చండూరు బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్‌ మరో డ్రామాకు తెరలేపబోతున్నారని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలను సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్‌ వైపు మళ్లించాలని కేసీఆర్‌ ప్రయత్నించినప్పటికీ ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.

ఎనిమిదేళ్ల పాలనలో మునుగోడు (Munugode) నియోజకవర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారని, గ్రామాలు, మండలాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏ తప్పు చేయకుంటే ఆయా ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందునే మరో ఏడాదిన్నర సమయం ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తున్నారన్నారు. రాజగోపాల్‌రెడ్డి అభివృద్ధిపై విసిరిన సవాల్‌పై సీఎం స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-10-30T19:27:48+05:30 IST