Telangana: కేంద్రంపై ఎదురుదాడికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

ABN , First Publish Date - 2022-11-24T10:53:59+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు.. కొత్తమలుపు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో..

Telangana: కేంద్రంపై ఎదురుదాడికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు.. కొత్తమలుపు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే అ

వినీతి నిరోధక బృందాన్ని (ACB) ఇందుకు అస్త్రంగా వాడుకోనుంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం అందినా, ఎవరి నుంచైనా లంచం డిమాండ్‌ చేసినట్లుగానీ, లంచం తీసుకున్నట్లుగానీ ఫిర్యాదులు అందినా.. ఆ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరుగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉండటంతో.. దాని ఆధారంగా ఎదురుదాడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీంతోపాటు సోదాలు చేసే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఎవరిపైనైనా చేయి చేసుకున్నా.. వారిపై కేసు పెట్టి అరెస్టు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ఏసీబీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు ప్రభుత్వాల మధ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఎన్‌ఫోర్స్‌మెట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇటీవల రాష్ట్రంలో వరుసగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీబీఐకి మాత్రం తెలంగాణలోకి ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ ‘సాధారణ సమ్మతి’ (జనరల్‌ కన్సెంట్‌)ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 30న తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోకి సీబీఐ నేరుగా అడుగు పెట్టే పరిస్థితి లేదు. కాగా.. ఐటీ, ఈడీ చేస్తున్న వరుస దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేందుకు ఏసీబీకి ఉన్న అధికారాలు, తదుపరి దశలో కేసు విచారణకు అనుమతి తీసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఇప్పటివరకు సీబీఐ కేసుకు నమోదు చేసేది. అయితే సాధారణ సమ్మతి ఉపసంహరణ నేపథ్యంలో సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశించేందుకు అవకాశం లేనందున.. ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం ఏసీబీకే ఉంటుందని నిర్ధారించింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు అందితే వెంటనే దాడులు, కేసుల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అందినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసుల నమోదు సందర్భంగా తలెత్తే న్యాయపరమైన అంశాలపై కూడా ప్రభుత్వం కూలంకుశంగా చర్చించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరైనా అవినీతికి పాల్పడ్డా, లంచం డిమాండ్‌ చేసినా, తీసుకున్నా ఏసీబీకి ఫిర్యాదు చేయాలనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. నున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు మొదటి వారంలో నిర్వహించే అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతోపాటు ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసే విధంగా ప్రచారం కల్పించనున్నట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసినందుకే..!

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఢిల్లీలో బీజేపీ నేతలు ప్రకటించడం, ఈ కేసులో సీబీఐ కేసు పెట్టడం, మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణలో అధికార పార్టీ ముఖ్య నాయకుల అత్యంత సన్నిహితులను విచారించింది. వాస్తవానికి సీబీఐ, ఈడీ ఎప్పుడు ఎవరెవరికి నోటీసులిస్తాయో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. విదేశాలకు గ్రానైట్‌ అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. మరోవైపు క్యాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులను, పీఏను ఈడీ విచారించడంతోపాటు ఎమ్మెల్సీ ఎల్‌.రమణను, ఇతర రాజకీయ ప్రముఖులను విచారించిది. మరోవైపు ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై నమోదైన కేసులో ఈడీ రెండు రోజులపాటు ఆయనను విచారించింది. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ ఫోకస్‌ పెట్టి.. రెండు రోజులు వరుస సోదాలు నిర్వహించింది. మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలోని దర్యాప్తు సంస్థలతో ముప్పేట దాడికి దిగుతోందని టీఆర్‌ఎస్‌ సర్కారు ఆరోపిస్తోంది. ఆయా దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల దూకుడు తగ్గించేందుకు వారిపై కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

Updated Date - 2022-11-24T10:53:59+05:30 IST

Read more