‘పీఎం కిసాన్‌’లో భారీగా కోతలు

ABN , First Publish Date - 2022-11-23T04:04:44+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం అమలులో లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించారని రైతుబంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

‘పీఎం కిసాన్‌’లో భారీగా కోతలు

దేశవ్యాప్తంగా 3.87 కోట్లకు లబ్ధిదారుల కుదింపు

మధ్యప్రదేశ్‌లో 88.53లక్షల నుంచి 12వేలకు

రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం అమలులో లబ్ధిదారుల సంఖ్యను భారీగా కుదించారని రైతుబంధు సమితి చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎంకిసాన్‌ పథకం ప్రారంభంలో 14.50 కోట్ల మంది అర్హులను గుర్తించినప్పటికీ, అందులో కేవలం 11.50 కోట్ల మందికి మాత్రమే డబ్బులను ఖాతాల్లో వేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్యను 3.87 కోట్లకు కుదించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో మొదటి విడతలో 88.63 లక్షల మంది రైతులకు నగదును ఖాతాల్లో జమ చేయగా 11వ విడత వచ్చేసరికి కేవలం 12వేల మందికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మొదటి విడత 109.98 లక్షల నుంచి 37.51 లక్షలకు, బిహార్‌ 83.38 లక్షల నుంచి 6.83 లక్షలకు, గుజరాత్‌లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు, ఏపీలో 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, తమిళనాడులో 46.08 లక్షల నుంచి 23.04 లక్షలకు, ఛత్తీ్‌సఘడ్‌లో 37.7 లక్షల నుంచి 2 లక్షలకు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారని పల్లా వివరించారు.

ఒక కుటుంబంలో భూమి పట్టాదార్లు ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తున్నారని, ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతులు, గృహ నిర్మాణ రుణం తీసుకున్నవారు, చిరు వ్యాపారులు, ఉద్యోగాలు చేస్తున్న వారు, ఆదాయపు పన్ను కడుతున్న వారిని అనర్హులుగా నిర్ణయించి పథకం నుంచి తొలగించారని రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయని, మహారాష్ట్రలో గడిచిన ఆరు నెలల్లో 1800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, చాలా మంది మోదీ పేరిట లేఖలు రాసి మరీ చనిపోతున్నారని రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై దేశవ్యాప్తంగా మరో పోరాటం మొదలైందని, సంయుక్త కిసాన్‌ మోర్చా చేపట్టే ఆందోళనలకు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-11-23T04:04:45+05:30 IST