CBI Notices: నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు
ABN , First Publish Date - 2022-12-01T16:33:51+05:30 IST
హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు వ్యాపారవేత్తలు.. యూసుఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడు, సనత్‌నగర్‌కు చెందిన రవి, వెంకటేశ్వరరావు, మరో వ్యక్తికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ: నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కేసు (Srinivas Case)లో విచారణ కొనసాగుతోంది. మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar), ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravi Chandra)ను గురువారం ఉదయం 11 గంటల నుంచి సీబీఐ (CBI) అధి
కారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్‌తో ఉన్న సంబంధాలు, లావాదేవీలపై విచారణ జరుగుతోంది. ఇదే కేసులో హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు వ్యాపారవేత్తలు.. యూసుఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడు, సనత్‌నగర్‌కు చెందిన రవి, వెంకటేశ్వరరావు, మరో వ్యక్తికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. నలుగురు వ్యాపారవేత్తలు శ్రీనివాస్‌కు డబ్బులు, ఆభరణాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు. ఈ వ్యవహారం అంతా వైజాగ్ నుంచే నడిపినట్లు సమాచారం. నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ తమిళనాడు భవన్‌లో 28వ తేదీన సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కాగా నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్‌రావుపై సీబీఐ ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎఫ్ఐఆర్‌లో నమోదైన వివరాల ప్రకారం.. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డాడు. సీబీఐ, ఈడీ కేసులను సెటిల్ చేయిస్తానని నమ్మబలికి డబ్బు వసూలు చేయించాడు. ఢిల్లీలోని తమిళనాడు, మధ్యప్రదేశ్ భవన్‌లను అడ్డాగా చేసుకొని సెటిల్మెంట్లు చేయించాడు. ఐదు సంవత్సరాలుగా శ్రీనివాసరావు ఢిల్లీలో మకాం వేశాడు. సీనియర్ ఐపీఎస్ అధికారి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల రాజకీయ నాయకులతో శ్రీనివాస్ టచ్‌లో ఉన్నాడు. ఢిల్లీలో పనులు చక్కబెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. శ్రీనివాస్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ 419, 420 కింద కేసులు నమోదయ్యాయి. సీబీఐ సీనియర్ ఆఫీసర్ నంటూ చెప్పి ప్రైవేటు సెటిల్మెంట్లు చేసినట్టు సీబీఐ విచారణలో తేలింది. యూసుఫ్‌గూడకు చెందిన మేలపాటి చెంచునాయుడుని శ్రీనివాస్ మోసం చేశాడు. ఢిల్లీలో వినయ్ హోండా కుమారుడికి సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. మార్గానా వెంకటేశ్వర రావు, రవికి చెందిన 2000 వాహనాలను ఢిల్లీలో నో ఎంట్రీ స్థలంలోకీ అనుమతించేలా పోలీసులతో మాట్లాడుతానని పైసలు వసూలు చేశాడు. పనులు చేయడానికి ప్రభుత్వ అధికారులకు ఖరీదైన బహుమతులు ఇవ్వాలంటూ ప్రైవెటు వ్యక్తుల వద్ద నిందితుడు శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా చిన్నవాల్తేర్ కిర్లంపూడికి చెందినవాడు కావడం గమనార్హం.