Minister KTR : నోట్ల రద్దు విఫలమైతే సజీవ దహనం చేయమన్నారు!

ABN , First Publish Date - 2022-11-08T06:01:29+05:30 IST

పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అనాలోచిత నిర్ణయం

Minister KTR : నోట్ల రద్దు విఫలమైతే సజీవ దహనం చేయమన్నారు!
Minister KTR

ఆ దుష్పరిణామాలకు బాధ్యత కూడా తీసుకోవట్లేదు..

తెలివితక్కువ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ పతనమైంది

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది

ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

పెద్ద నోట్ల రద్దుకు నేటితో ఆరేళ్లు

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల పన్ను రాబడి సైతం తగ్గిపోయిందని ఆరోపించారు. ఆ ప్రభావం సంక్షేమ కార్యక్రమాల అమలుపై పడిందన్నారు. 50 రోజుల సమయం ఇవ్వాలని, నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే సజీవంగా దహనం చేయాలంటూ నాడు మోదీ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి మంగళవారానికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నోట్ల రద్దు దుష్ఫలితాలను గుర్తు చేస్తూ, వాటికి భాద్యత తీసుకోని ప్రధానిపై విమర్శలు గుప్పించారు. పురోగమనం దిశగా అడుగులు వేస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారన్నారు. నవంబరు 8, 2016న పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ మోదీ సర్కారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.

భారీగా పెరిగిన నగదు..

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో సూమారు రూ.30.88 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉందని, అంటే నోట్ల రద్దుపై బీజేపీ చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందని కేటీఆర్‌ అన్నారు. 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి రూ.17.97 లక్షల కోట్లు చలామణీలో ఉండేవని, ప్రస్తుతం అది 72 శాతం పెరిగి రికార్డుస్థాయిలో రూ.30.88 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. నోట్లు రద్దు చేసిన 2016 నుంచి ఏటా ఆర్థిక వ్యవస్థలో తమ లావాదేవీల కోసం నగదును వినియోగిస్తున్న ప్రజల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. కానీ, కేంద్రం మాత్రం నోట్ల రద్దు విజయవంతమైందని గొప్పలు చెబుతోందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికే నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించామని ప్రకటించుకున్న కేంద్రం.. చివరికి తెల్ల ముఖం వేయాల్సి వచ్చిందని, కొత్త నోట్ల ముద్రణకు ఆర్బీఐకి రూ.21వేల కోట్ల ఖర్చు తప్ప సాధించింది శూన్యమని తెలిపారు. నోట్ల రద్దు, కరోనా కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయని కేటీఆర్‌ తెలిపారు.

ప్రధాని క్షమాపణ చెప్పాలి..

నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే సజీవ దహనం చేయాలని ప్రధాని ప్రకటించారని.. ఆ మాట పక్కనపెడితే కనీసం నోట్ల రద్దు దుష్పరిణామాలకు బాధ్యత తీసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా లేదని కేటీఆర్‌ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తప్పని అంగీకరించి, దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Updated Date - 2022-11-08T06:01:30+05:30 IST