BL Santhosh: 28న హైదరాబాద్‌కు బీఎల్‌ సంతోష్‌.. హీటెక్కనున్న తెలంగాణ రాజకీయాలు..!

ABN , First Publish Date - 2022-12-17T11:03:31+05:30 IST

ఈనెల 28న బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ (BL Santosh) హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులు బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

BL Santhosh: 28న హైదరాబాద్‌కు బీఎల్‌ సంతోష్‌.. హీటెక్కనున్న తెలంగాణ రాజకీయాలు..!

హైదరాబాద్: ఈనెల 28న బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ (BL Santosh) హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులు బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమానికి సంతోష్ హాజరవుతారని బీజేపీ (BJP) నేతలు చెబుతున్నారు. ఈ మూడు రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారి, కన్వీనర్, ఫుల్ టైమర్, పాలక్‌లను కలిపి ఒక టీమ్‌గా ఏర్పాటు చేస్తారు. ఈ టీంకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్ (Tarun Chugh), సునీల్ బన్సల్ హాజరవుతారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం పూర్తిస్థాయి దృష్టి సారించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ అధిష్టానం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణలో నియోజకవర్గాల వారిగా పార్టీ పురోగతిపై చర్చించే అవకాశం ఉంది.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ (Moinabad Farmhouse)లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో బీఎల్ సంతోష్ పేరును చేర్చారు. ఆయనకు సిట్ నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సంతోష్ సిట్ విచారణకు రాలేదు. సిట్ విచారణకు హాజరుకానీ ఆయన.. ఇప్పుడు తెలంగాణ పర్యటనకు వస్తుండడంతో రాజకీయంగా హీట్ పెంచింది. సంతోష్.. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి. ఆ పార్టీలో అత్యంత ప్రధానమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ‘‘సంతోష్‌ జీని కలిసేందుకు మోదీ, అమిత్‌ షాలే ఆయన ఇంటికి వస్తారు. ఆయన వాళ్ల దగ్గరకు వెళ్లరు. ఇది ఆరెస్సెస్‌ ప్రొటోకాల్‌ విధానం’’ అని మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు రామచంద్ర భారతి చెప్పారంటే ఆయన ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పుడు సదరు సంతోష్‌కు సిట్‌ నోటీసు ఇవ్వడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-12-17T11:06:25+05:30 IST