TRS MLAs poaching case: మొయినాబాద్‌ పోలీసులకు షాక్

ABN , First Publish Date - 2022-12-06T17:27:46+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది.

TRS MLAs poaching case: మొయినాబాద్‌ పోలీసులకు షాక్
TRS MLAs poaching case

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో మొయినాబాద్ పోలీసులకు చుక్కెదురైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌‌తో పాటు తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాస్‌‌లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలంటూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మెమోపై నిందితుల తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమో ద్వారా నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రోసీడింగ్ లేదని వాదించారు. శ్రీనివాస్ తరఫు లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. మెమోను న్యాయమూర్తి కొట్టివేశారు.

మెమో రిజెక్ట్ చేయడానికి గల కారణాలను కూడా ఏసీబీ చూపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కేసు దర్యాప్తు చేయడానికి లా అండ్ ఆర్డర్‌కు కానీ సిట్‌కు కానీ ఎలాంటి అధికారం లేదని పేర్కొంది. కేవలం ఏసిబి మాత్రమే ఈ కేస్ దర్యాప్తు చేయాలని సూచించింది. లా అండ్ ఆర్డర్ కానీ, సిట్ కానీ ఎటువంటి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు కాబట్టి వారికి ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. బీఎల్ సంతోష్‌‌తో పాటు తుషార్, న్యాయవాది శ్రీనివాస్‌‌లను నిందితులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. ఇవే కారణాలు చూపుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్ట్ రిజెక్ట్ చేసింది.

మరోవైపు ఈ కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సిట్ తరఫున వాదనలు వినిపించారు. నిందితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఉదయ్ హుల్ల వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు వాడివేడిగా కొనసాగాయి. దవే వాదనలు వినిపిస్తూ.. వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ప్రభుత్వాలను అస్థిరపరిచేలా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసిందని వాదించారు. సీబీఐ చేత విచారణ కోరే అర్హత నిందితులకు లేదని దవే కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఉదయ్ హుల్లా వాదిస్తూ.. రాష్ట్ర సర్కారు పోలీసులను ఉపయోగించి చట్టవిరుద్ధంగా అరెస్ట్‌లు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో 41 A సీఆర్‌పీసీ కింద విచారణ పేరుతో నోటీసులు జారీ చేసి బీజేపీ పార్టీ పెద్దల పేర్లు చెప్పమని వేధింపులు గురిచేస్తున్నట్టు నిందితుల తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.

హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు.

Updated Date - 2022-12-06T18:50:40+05:30 IST