India Vs Bangleadesh: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీ బాదిన పుజారా: బంగ్లాదేశ్ ఎదుట కొండంత లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-16T16:24:18+05:30 IST

బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత (Team India) జట్టు పూర్తిగా పట్టుబిగించింది.

India Vs Bangleadesh: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీ బాదిన పుజారా: బంగ్లాదేశ్ ఎదుట కొండంత లక్ష్యం
Team India

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత (Team India) జట్టు పూర్తిగా పట్టుబిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 133/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 17 పరుగుల తేడాతో చివరి రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. నిజానికి బంగ్లాదేశ్‌ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ భారత జట్టు ఆ పని చేయకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచిన రాహల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఉసూరుమనిపించాడు. 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)తో కలిసి గిల్ (Shubman Gill) జాగ్రత్తగా ఆడాడు. ఇద్దరూ కలిసి అడపాదడపా బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో గిల్, పుజారా ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొన్న గిల్ టెస్టుల్లో తొలి శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత మరో 10 పరుగులు జోడించి అవుటయ్యాడు. మొత్తంగా 152 బంతులు ఆడిన గిల్ 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 110 పరుగులు చేశాడు.

మరోవైపు, తొలి ఇన్నింగ్స్‌తో త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న పుజారా ఈసారి మాత్రం జాగ్రత్తగా ఆడాడు. నిదానంగా ఆడుతూ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 130 బంతులు ఎదుర్కొన్న పుజారా 13 ఫోర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 19 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని భారత్ ఆధిక్యం 500 పరుగులు దాటడంతో 282/2 వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

అనంతరం 513 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. నజ్ముల్ హొసైన్ షంటో 25, జకీర్ హసన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-12-16T16:34:55+05:30 IST