Pakistan vs New Zealand : ఎవరిదో పైచేయి?

ABN , First Publish Date - 2022-11-09T05:24:50+05:30 IST

సూపర్‌-12లో కివీస్‌ అద్భుత ఆటతీరుతో ఆసీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌లపై గెలిచి నాకౌట్‌ దశకు చేరింది. ఓ మ్యాచ్‌ వర్షంతో రద్దయింది.

Pakistan vs New Zealand : ఎవరిదో పైచేయి?
వరల్డ్‌కప్‌ తొలి సెమీస్‌

సంచలనాల పాక్‌

నిలకడగా కివీస్‌

వరల్డ్‌కప్‌ తొలి సెమీస్‌ నేడు

టీ20 ప్రపంచకప్‌ అత్యంత కీలక దశకు చేరింది. బుధవారం నుంచే సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. దీంతో ఇక ఏ జట్టుకూ రెండో అవకాశమే లేదు. గెలిస్తే సరి.. లేకుంటే ఇంటికే. సిడ్నీ క్రికెట్‌ మైదానంలో జరిగే మొదటి సెమీస్‌లో పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. మరి.. ఇద్దరిలో పైచేయి సాధించి ఫైనల్‌ చేరేదెవరో..?

సిడ్నీ: సూపర్‌-12లో కివీస్‌ అద్భుత ఆటతీరుతో ఆసీస్‌, శ్రీలంక, ఐర్లాండ్‌లపై గెలిచి నాకౌట్‌ దశకు చేరింది. ఓ మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. అటు పాక్‌ ప్రస్థానం మాత్రం కిందామీదా పడుతూ సాగింది. భారత్‌, జింబాబ్వే చేతిలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడాక ఆ టీమ్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్లేయర్స్‌ కూడా ఆశలు వదిలేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ టోర్నీ నుంచి బయటికి వెళ్లాల్సిన జట్టుకు నెదర్లాండ్స్‌ విజయంతో ఊహించని రీతిలో అదృష్టం కలిసొచ్చింది. ఈ ఉత్సాహంతో బంగ్లాపై గెలిచి సెమీ్‌సకు చేరుకుంది. మరోవైపు ప్రత్యర్థి కివీ్‌సపై పాక్‌కు మెరుగైన రికార్డు ఉండడం సానుకూలాంశం. కానీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్‌ ఈసారి పాక్‌కు చెక్‌ పెట్టాలన్న కసితో ఉంది. ఇదిలావుండగా ప్రస్తుత టోర్నీలో ఎస్‌సీజీ మైదానంలో కివీస్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో, పాక్‌ ఆడిన ఓ మ్యాచ్‌లోనూ విజయాలు సాధించాయి.

ఓపెనర్లు కుదురుకుంటే..

పాక్‌ సాధించిన విజయాల్లో ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌లకు ఎలాంటి భాగస్వామ్యం లేకపోయింది. టీ20 ఫార్మాట్‌లో ఈ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లయినప్పటికీ ఫామ్‌ లేమితో ఒత్తిడిలో ఉన్నారు. బంగ్లాపై 128 పరుగుల ఛేదనలో కూడా విఫలమయ్యారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో వారి బ్యాట్లు గర్జిస్తే మాత్రం కివీస్‌ బౌలర్లకు కష్టకాలమే. మిడిలార్డర్‌లో ఇఫ్తికార్‌, షాన్‌ మసూద్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. అయితే పాక్‌ బలమంతా వారి బౌలింగే. పేసర్లు షహీన్‌ అఫ్రీది, రౌఫ్‌, నసీమ్‌ షా, మహ్మద్‌ వసీంలపై ఆధారపడింది. బంగ్లాపై నాలుగు వికెట్లతో షహీన్‌ ఫామ్‌లోకి రావడం జట్టు బౌలింగ్‌ బలాన్ని మరింత పెంచినట్టయింది.

ఆల్‌రౌండ్‌ ప్రతిభతో..

పాక్‌ మాదిరే కివీస్‌ బౌలర్లు కూడా ప్రత్యర్థి జట్లపై చెలరేగుతున్నారు. ఇదే మైదానంలో ఆసీస్‌, శ్రీలంక టాపార్డర్‌ను పేసర్లు బౌల్ట్‌, సౌథీ కుప్పకూల్చి జట్టుకు సునాయాస విజయాలనందించారు. ఇదే తరహాలో ఫామ్‌లో లేని పాక్‌ ఓపెనర్లను దెబ్బతీసి ఆదిలోనే ఒత్తిడిలోకి నెట్టాలనుకుంటున్నారు. లోకీ ఫెర్గూసన్‌ కూడా పదునైన బంతులతో వికెట్ల వేట కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో టాపార్డర్‌లో ఫిన్‌ ఆలెన్‌, కాన్వే, కెప్టెన్‌ విలియమ్సన్‌తో పాటు మిడిలార్డర్‌లో ఫిలిప్స్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అలాగే వేలి గాయం తర్వాత బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ కూడా ఆకట్టుకుంటున్నాడు. కానీ లెగ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంతో కేన్‌, మిచెల్‌ ఇబ్బందిపడుతున్నారు. దీంతో షాదాబ్‌ పాక్‌ జట్టుకు కీలకం కానున్నాడు.

తుది జట్లు (అంచనా)

పాకిస్థాన్‌: మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ హరీస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌, మహ్మద్‌ వసీం, నసీమ్‌ షా, షహీన్‌, రౌఫ్‌.

న్యూజిలాండ్‌: ఆలెన్‌, కాన్వే, విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిలిప్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, బౌల్ట్‌, సోధీ, ఫెర్గూసన్‌.

పిచ్‌, వాతావరణం

సహజంగా ఎస్‌సీజీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. ఈసారి ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. ఉదయం చిరు జల్లులకు ఆస్కారమున్నా మ్యాచ్‌ సమయానికి వాతావరణం అనుకూలిస్తుంది.

2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్‌ సెమీ్‌సలో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది.

30 ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌తో తలపడిన మూడుసెమీఫైనల్స్‌లోనూ (1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌.. 2007 టీ20 వరల్డ్‌కప్‌) పాక్‌ గెలిచింది.

Updated Date - 2022-11-09T08:11:50+05:30 IST