Shahid Afridi: ఐసీసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ అఫ్రిది
ABN , First Publish Date - 2022-11-04T19:31:41+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో బుధవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు (team india) అతి కష్టం మీద విజయం సాధించింది.
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో బుధవారం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు (team india) అతి కష్టం మీద విజయం సాధించింది. బంగ్లాదేశ్(bangladesh) ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ భారత్‌ను వణికించాడు. 27 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టును గెలిపించినంత పనిచేశాడు. ఆ తర్వాత వర్షం పడడంతో మ్యాచ్‌ను కుదించడం, చివరికి ఐదు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఐసీసీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చూస్తుంటే భారత జట్టును సెమీస్‌లో ఆడించాల్సిందేనని ఐసీసీ కంకణం కట్టుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించాడు. లేకపోతే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా ఆడించటమేంటని ప్రశ్నించాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఎందుకంటే దక్షిణాఫ్రికా-జింబాబ్వే, పాకిస్థాన్-దక్షిణాఫ్రికా మ్యాచుల్లోనూ ఇలాగే జరిగింది. వర్షం పడి వెలిశాక మైదానం చిత్తడిగా ఉన్నా ఆటను కొనసాగించారు. వాటి గురించి మాట్లాడకుంటే కేవలం ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించే మాట్లాడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఈ మ్యాచ్‌ను కనుక మీరు చూస్తే.. మైదానం చిత్తడిగా ఉంది. అయితే, ఐసీసీ మాత్రం భారత్‌కు అనుకూలంగా వ్యహరించింది. భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సెమీస్ చేరాలని వారు బలంగా కోరుకున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు అంపైర్లుగా వ్యవహరించిన వారికి ఉత్తమ అంపైర్లుగా అవార్డులు దక్కుతాయి’’ అని అఫ్రిది పేర్కొన్నట్టు సామ్నా టీవీ జర్నలిస్టు పేర్కొన్నారు. అంత పెద్ద వర్షం పడ్డాక వర్షం తెరిపినిచ్చిన వెంటనే మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించేశారని అఫ్రిది విమర్శించాడు. ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేందుకు చాలా అంశాలు ఉన్నాయి. ఐసీసీ, ఇండియా ఆడడం, ఒత్తిళ్లు.. ఇలా ఎన్నో కారణాలు ఆటను వెంటనే ప్రారంభించడానికి ప్రభావితం చేశాయని అన్నాడు.
అయితే, లిటన్ దాస్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అఫ్రిది కొనియాడాడు. ఆరు ఓవర్ల తర్వాత మరో రెండుమూడు ఓవర్లపాటు వికెట్లు కోల్పోకుండా ఉండే బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందని భావించామన్నాడు. మొత్తాన్ని బంగ్లాదేశ్ మాత్రం మంచి ఫైట్ ఇచ్చిందని ప్రశంసలు కురిపించాడు. కాగా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ మాట్లాడుతూ.. మైదానం తడిగా ఉన్నప్పుడు బౌలింగ్ జట్టు కంటే బ్యాటింగ్ జట్టుకే అనుకూలంగా ఉంటుందని చెప్పడం గమనార్హం. కాగా, ఆదివారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా భారత జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది.